ఈ రోజు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో (మంగళవారం) ఈ ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రెండిట్లోనూ.. బాలికల ఉత్తీర్ణత 72 శాతం పైనుండగా, బాలుర ఉత్తీర్ణత 60 శాతం లోపు ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గడిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్ అని వెల్లడించారు. అయిన విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్‌లైన్‌లో బోధన చేసి, గతేడాది 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించామని తెలిపారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు 2500 కాలేజీల్లో కౌన్సెలింగ్‌లు కూడా నిర్వహించామని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 62శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని మూడు ప్రభుత్వ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.in వీటిలో ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసి, ఆ తర్వాత ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే.. స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్ షీట్‌ను ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
ఇక ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారని, ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు స్వీకరించి, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కి కూడా అవకాశం కల్పించామని తెలిపారు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను కూడా విడుదల చేస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.