ఏపీ మంత్రి రోజా సెల్‌ ఫోన్‌ చోరి.. పోలీసులకు చెమటలు..

335
rk roja
- Advertisement -

ఏపీ మంత్రి ఆర్కే రోజాకు గురువారం ఓ దొంగ షాకిచ్చాడు. మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తొలిసారి త‌న సొంత జిల్లాకు వచ్చిన రోజాకు వింత అనుభవం ఎదురైంది. మంత్రి పదవి వచ్చిన సందర్భంగా ఆమె గురువారం తిరుపతిలోని శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుండి ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అయితే ఆమెను స‌న్మానించేందుకు అధికారులు, వైసీపీ నేత‌లు భారీగా వచ్చారు. జన సందోహం ఎక్కువగా ఉండడంతో ఇదే మంచి అవకాశం అనుకున్న ఓ వ్య‌క్తి మంత్రి రోజా సెల్‌ ఫోన్‌ను చోరీ చేశాడు. త‌న సెల్ ఫోన్ క‌నిపించ‌క‌పోయే స‌రికి కంగారు ప‌డ్డ రోజా వెంటనే అక్కడే ఉన్న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

మంత్రి మొబైల్ ఫోన్ చోరీకి గురైంద‌న్న ఫిర్యాదుతో పోలీసులు కూడా వెనువెంట‌నే రంగంలోకి దిగేశారు. అక్క‌డి సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించారు. అందులో రోజా మొబైల్‌ను చోరీ చేసిన వ్య‌క్తిని గుర్తించారు. రోజా సెల్ ఫోన్‌ను లాఘ‌వంగా త‌స్క‌రించేసిన స‌ద‌రు వ్య‌క్తి.. ఫోన్‌తో కారు ఎక్కేసి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. కారు నెంబ‌రు ఆధారంగా పోలీసులు అత‌డి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎస్వీ యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోకి వెళ్లిన‌ట్టుగా గుర్తించారు. వెంట‌నే అక్క‌డికి ప‌రుగులు పెట్టిన పోలీసులు ఎట్ట‌కేల‌కు దొంగ‌ను ప‌ట్టుకున్నారు. అత‌డి నుంచి సదరు సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, మంత్రికి అందజేశారు. విచార‌ణ‌లో భాగంగా అత‌డు కాంట్రాక్టు ఉద్యోగి అని తేలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

- Advertisement -