మేడారం సమక్క – సారక్క మహా జాతర ఏర్పాట్లపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టి.ఎన్. ఆర్టీసీ సంస్థ అధ్యక్షులు బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం బస్‌భవన్‌లో సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారం జాతర రవాణా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి అధికారులకు కొన్ని సూచనలు చేశారు.
మేడారం ప్రయాణీకులకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అదే సమయంలో విధులు నిర్వహించే సిబ్బందికి మంచి ఆహారాన్ని అందించడంతో పాటు మెరుగైన వసతి సదుపాయాలను కూడా కల్పించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు సూచించారు. కోవిడ్ , ఒమేక్రాన్ల నుంచి రక్షించుకునేందుకు సిబ్బందికి స్పెషల్ డ్రైవ్ ద్వారా బూస్టర్ డోన్లను ఇప్పించాలని, హ్యాండ్ శానిటైజర్స్ , మాస్కులను కూడా అందివ్వాలని ఆదేశించారు. డిపో నుంచి బయలుదేరే సమయంలో బస్సును పూర్తిగా శానిటైజేషన్ చేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షల మేరకు మేడారం భక్తుల రాకపోకల సమయంలో రవాణా రంగా ఎలాంటి నిరీక్షణ ఉండకూడదనే ఉద్దేశ్యంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో బస్సులను నడపాలని సూచించారు.
బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ.. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టి.ఎన్. ఆర్టీసీ అధికార యంత్రాంగం పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ జాంలను నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని టి.ఎన్. ఆర్టీసీ సంస్థ అధ్యక్షులు బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. సమక్క – సారక్క జాతరకు తండోపతండాలుగా తరలివచ్చే ప్రయాణీకులకు అన్ని రకాల ఏర్పాట్లతో సేవలు అందించడం కోసం ప్రభుత్వ సహకారంతో సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. 12 వేల మంది సిబ్బంది, 150 మంది అధికారులతో మేడారం వెళ్ళు భక్తులకు సేవలు అందించనున్నారు.
టి.ఎస్. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. మేడారం జాతర సేవల్లో 12 వేల మంది సిబ్బంది , 150 మంది అధికారులు పాలుపంచుకుంటున్నారని తెలిపారు. జాతర సమయంలో ప్రత్యేకంగా 50 సి.సి కెమరాలతో పాటు బస్సుల రాకపోకలు వివరాలను తెలిపేందుకు ఆయా బస్టాండులలో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అధికారులు , సిబ్బంది సమన్వయంతో మేడారం జాతరలో ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కావల్సిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జాతర రాకపోకలకు సంబంధించి ముందస్తుగా టి.ఎన్ . ఆర్టీసీ ఆన్లైన్ రిజర్వేషన్ ద్వారా కూడా బుక్ చేసుకునే వెసలుబాటు హైదరాబాద్ నుంచి కల్పించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సమీక్షా సమావేశం అనంతరం బస్‌భవన్‌లో మంత్రి, ఛైర్మన్లను కలిసిన కిన్నెర మొగులయ్యను శాలువా, పూలమాలతో పువ్వాడ అజయ్ కుమార్, బాజిరెడ్డిలు సన్మానించి అభినందించారు . సామాన్య కుటుంబం నుంచి తన జీవన ప్రస్తానంను ప్రారంభించి అసమాన స్థాయిలో పద్మశ్రీ అవార్డును కైవసం చేసుకోవడంపై దర్శనం మొగులయ్య కృషి స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు.