కోవిడ్ సేవలపై నిరంతర పర్యవేక్షణ- మంత్రి పువ్వాడ

43
Minister Puvvada

ఊహించకుండానే విరుచుకుపడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ ప్రాణాలు తీస్తున్న కోవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు కోవిడ్‌పై నిరంతరంగా పోరాడుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని, సేవలను మెరుగు పరచడంతో పాటు సదుపాయాల కల్పనకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ బ్లాక్ నందు మంత్రి పువ్వాడ పర్యటించి వార్డులలో కలియతిరిగి కోవిడ్ పేషెంట్లను ఆత్మీయంగా పలకరిస్తూ.. మీరు ఆరోగ్యంగా ఇంటికి వెళతారని మనోధైర్యాన్ని నింపారు. మీ ఆరోగ్యాలు చూసి రమ్మని ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను పంపారని ప్రభుత్వం మీకు అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వారిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సొంత నిధులతో కోవిడ్ పేషెంట్స్ కొరకు ఏర్పాటు చేసిన భోజనంను వారికి స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, అన్ని వసతులు సమకూర్చమన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తద్వారా చికిత్స చేస్తున్న ప్రతి రోగికి ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. కరోనా చికిత్స కొరకు ఈ ఆసుపత్రి అనుకూలంగా, అందుబాటులో ఉంటుందని ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులలో డబ్బులు వృధా చేసుకోకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకోవాలని, అవసరమైన ఇంజక్షన్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

కరోనా సోకిన మన దగ్గర బంధువుల దగ్గరికి వెళ్లడానికే మనం భయపడతామని కానీ నర్సింగ్, శానిటేషన్, డాటా ఎంట్రీ ఆపరేటర్ లు, డాక్టర్లు, ఏఎన్ఎంలు 24 గంటలు పనిచేస్తూ వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి సుమారు 320 మంది రోగులకు సేవలు అందిస్తున్నారని వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు ఒత్తిడిలో కూడా సొంత వ్యక్తుల కంటే బాగా కమిట్మెంట్తో పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. తాను, జిల్లా కలెక్టర్ ఇతర ప్రజాప్రతినిధులు, సమన్వయంలో ప్రతి రోజు కూడా కరోనా పేషెంట్లకు సమకూర్చే సదుపాయాలు, సేవలపై చర్చించుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని వివరించారు.

పేషెంట్లు వారి బంధువులు సామరస్యంగా ఉండాలని అని మంత్రి సూచించారు. ప్రభుత్వం 100% శక్తిమేర పేషెంట్లను ఈ వైరస్ నుండి కాపాడడానికి కృషి చేస్తుందని తెలిపారు. మంత్రి వెంట DM&HO మాలతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, RMO శ్రీనివాస్, వైద్యులు సిబ్బంది ఉన్నారు.