పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే మూల సూత్రం ద్వారా పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక స్మశాన వాటిక, ఒక డంపింగ్ యార్డ్, ఏర్పాటు చేయాలన్న ఆలోచన గతంలో ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదు. గత ప్రభుత్వ హయాంలో ఒక వ్యక్తి, ఒక గ్రామం కేంద్రంగా పనులు జరగలేవు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన సమావేశంకు గైహాజరైన విద్యుత్ శాఖ ఎస్సీ, డీఈ ఈ లకు మెమోలు జరిచేయాల్సిందిగా సూచించారు.
గ్రామం ఒక యూనిట్ గా చేసుకొని గ్రామంలో కావాల్సిన పనులు గుర్తించి ఆ పనులు చేసుకోవడానికే ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించడం జరిగింది. గ్రామ పంచాయతీలకు వనరులు కల్పించి, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. గ్రామాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 815 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కో వ్యక్తికి 815 రూపాయలు చెల్లిస్తుంది. గ్రామంలోని ఒక్కో వ్యక్తికి 815 రూపాయలు చెల్లించడం అనేది దేశంలోనే ఇది ఒక గొప్ప విషయం.
పల్లె ప్రగతి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు 41.50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి గ్రామానికి తప్పనిసరిగా ట్రాక్టర్ కొనుగోలు చేయాలి. పల్లె ప్రగతి కార్యక్రమం ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే విజయవంత మవుతుంది. గతంలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం 88 శాతం బాగుందని సీఎం చేసిన సర్వేలో వెల్లడైందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.