కేసీఆర్ లక్ష్యం కోటి ఎకరాలకు సాగునీరు- మంత్రి

198
Minister Prashanth reddy review On SRSP
- Advertisement -

ఎస్సారెస్పీ నుండి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు గోదావరి నీళ్లను లిఫ్ట్‌ల ద్వారా తీసుకురావడానికి ఉద్దేశించబడినటువంటి ప్యాకేజ్ 20,ప్యాకేజ్ 21 పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం- కోటి ఎకరాలకు సాగునీరు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ప్రతి సంవత్సరం కాళేశ్వరం నీళ్లతో ఎస్సారెస్పీ ని నింపడం ఖాయం కాబట్టి…అందులో భాగంగా ప్యాకేజి 20, 21 పనులు పూర్తయితే ఆర్మూర్ నియోజకవర్గంలో 7వేలు, బాల్కొండ నియోజకవర్గంలో 80వేల ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1లక్ష 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

ఎస్సారెస్పీ ప్రాజెక్టు వెనుకభాగమైన బినోలా నుండి టన్నెల్ ద్వారా సారాంగపూర్ పంప్ హౌస్‌లోకి నీటిని తీసుకురావడం అక్కడి నుండి నిజాంసాగర్ పాత కెనాల్‌లో పంపించడం జరుగుతుందన్నారు.ఈ ప్యాకేజ్ 20లో భాగమైన సారంగపూర్ పంప్ హౌస్ పనులు,సర్జ్ పూల్ పనులు 85 శాతం మేర పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించగా…వచ్చే రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తి చేసి నీటిని నిజాంసాగర్ పాత కెనాల్ లోకి లిఫ్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

Minister Prashanth reddy review On SRSP

నిజాంసాగర్ కెనాల్లో పడ్డ నీటిలో ఒకవైపు….గ్రావిటీ కెనాల్ మరియు టన్నెల్ ద్వారా కొండెం చెరువులో పడతాయని,ప్యాకేజ్ 21 పనుల్లో భాగమైన ఈ గ్రావిటీ కెనాల్ మరియు టన్నెల్ కూడా రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.కొండెం చెరువు నుంచి 480 క్యూసెక్కుల నీరు పైపు లైన్ల ద్వారా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 90 వేల ఎకరాలకు సాగునీరు అందించబడుతుందన్నారు. దీనికి సంబంధించిన ప్యాకేజ్ 21-Aలో భాగంగా గడ్కోల్ పైప్ లైన్ పనుల్లో 63 కి.మీ ఎంఎస్‌ పైపులైన్‌కు గాను 23 కి.మీ పూర్తయిందని అధికారులు మంత్రికి చెప్పారు.మిగతా ఎంఎస్‌ పైప్ లైన్ పనులు,ఐడి పైపులైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

మరోవైపు…ప్యాకేజి 21-Bలో భాగంగా నిజాంసాగర్ కెనాల్ నుంచి వచ్చే నీరు మెంట్రాస్ పల్లి పంప్ హౌస్ నుండి 650 క్యూసెక్కుల నీరు పైప్ లైన్ల ద్వారా ఆర్మూర్, జక్రాన్ పల్లి, వేల్పూర్, భీంగల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందివ్వబడుతుందని తెలిపారు. మెంట్రాస్ పల్లి పంప్ హౌస్ పనులు 70శాతం పూర్తయ్యాయని అధికారులు తెలుపగా.. మిగతా మొత్తం పనులు జూలై చివరి నాటికి పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.

మెట్ పల్లి పైపులైన్ పనుల్లో 88కి.మీ ఎంఎస్‌ పైపులైన్ పనికి గాను 69 కి.మీ ఎంఎస్‌ పైపులైన్ పని పూర్తయ్యిందన్నారు.అట్లాగే 190 కి.మీ ఐడి పైపు లైన్ పనులకు 102కి.మీ ఐడి పైపులైన్ పనులు పూర్తయ్యాయి అన్నారు. ప్యాకేజ్ 21-బీ మెట్పల్లి పైపులైన్ పనుల్లో వేగం పెంచి ఈ వానాకాలం సీజన్ కు ఆర్మూర్, జక్రాన్ పల్లి, వేల్పూర్ మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సిద్ధం కావాలని అధికారులను మరియు కాంట్రాక్టర్లను ఆదేశించారు. రైతులు,స్థానిక ప్రజాప్రతినిధులు పైపులైన్ పనులకు ఆటంకం కలిగించకూడదని, పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకరించాలని చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతున్నానని అన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ సి.ఈ మధుసూదన్ రావు,ఎస్.ఈ ఆత్మారామ్, సంబంధిత ఈ.ఈ, డి.ఈ లు మరియు వర్క్ ఏజెన్సీ అయినటువంటి మెగా కన్స్ట్రక్షన్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -