వ్యవసాయం వృతి కాదు జీవితం అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రెడ్ హిల్స్ ఫ్యాప్సీలో జరిగిన సీడ్స్ మెన్ అసోసియేషన్ 27వ వార్షిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇది సంస్కృతిని నేర్పే ఆయుధం అన్నారు. భూమికి, మట్టికి దూరం కావడం అంటే తల్లిదండ్రులకు దూరం అయినట్లేనని చెప్పారు. రాబోయే రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా భారతదేశం నిలుస్తుందన్నారు.
యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపితేనే దేశ భవిష్యత్ కు మేలు చేస్తుందన్నారు. యువత ఈ రంగం వైపు ఆత్మ విశ్వాసంతో అడుగులు వేసేలా తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. దార్శనిక నాయకులు మాత్రలు దిశను చూపగలుగుతున్నారు…దేశ రాజకీయాల్లో మొదటి నుండి దార్శనిక ఆలోచనల లోటు ఉందన్నారు. ప్రపంచ విత్తనరంగాన్ని శాసించే స్థాయికి తెలంగాణ ఎదగాలన్నారు.
నాణ్యమైన విత్తనం రైతుకు అందాలి…నిరంతర పరిశోధనలతోనే ప్రగతి సాధ్యం అన్నారు. పరిశోధనల మూలంగానే చిన్న దేశమైనా ఇజ్రాయిల్ ప్రపంచదేశాలు తనను అనుసరించేలా చేస్తుందన్నారు. విత్తనరంగంలో విత్తన కంపెనీలు మరిన్ని పరిశోధనలు పెంచాలని…ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారం ఉంటుందన్నారు. కాలక్రమంలో పంటల సాగు విధానం మారిందన్నారు.
ఒకప్పుడు వానాకాలం పండించే వేరుశెనగ ఇప్పుడు యాసంగిలో పండిస్తున్నారు .. తాజాగా పత్తి సాగు యాసంగిలో వేస్తున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో వెంకటేశ్వర్లు అనే రైతు యాసంగిలో పత్తి సాగు చేసి 18 క్వింటాళ్లు సాధించారని…రైతును మించిన శాస్త్రవేత్తలు లేరు అనడానికి ఇది నిదర్శనం అన్నారు. శాస్త్రవేత్తలు కూడా కాలానికి అనుగుణంగా మారాలి….రాబోయే యాసంగిలో పెద్ద ఎత్తున పత్తి సాగుకు రైతులు సిద్దమవుతున్నారని చెప్పారు.