తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసింతే. ఇందులో భాగంగా శనివారం ఆయన కర్ణాటకలోని రాంనగర్ సెరికల్చర్ మార్కెట్, మద్దూరు తాలూకా కెస్తూరులో మల్బరీ సాగుపై మైసూరు సీఎస్ఐటీలో సంస్థ డైరెక్టర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల తలరాత మారాలన్నదే కేసీఆర్ ఆలోచన అన్నారు. సాంప్రదాయ పంటల నుండి రైతులను ఇతర పంటలవైపు మళ్లించేందుకు వివిధ రాష్ట్రాలలో పంటల సాగు, ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. వ్యవసాయంలోనే దేశ భవిష్యత్ ఉంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరే రంగమూ ప్రజలకు ఇంత భరోసా ఇవ్వదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమయిన ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి తెలిపారు.
ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి రాకతో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారింది. రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు పథకాలతో రైతాంగానికి సీఎం అండగా నిలుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంత అభివృద్ధి సాధించినా ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతాంగంలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు మంత్రి. ఉన్నత విద్యావంతులు ఉద్యోగాలు వదిలి వ్యవసాయం చేస్తున్నారు. గత ఏడాది ఎఫ్‌సిఐ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో ఒక్క తెలంగాణ నుండే 55 శాతం సేకరించడం జరిగింది. అనుకోకుండా ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు నిలిపేస్తే రైతాంగం చిక్కుల్లో పడుతుంది. అందుకే రైతులకు లాభాలు అందించే వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుపై అధ్యయనం చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
రైతులను పంటల మార్పిడి వైపు మళ్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అందుకే కర్ణాటకలో సెరికల్చర్, హార్టికల్చర్ రంగాలలో అనుసరిస్తున్న విధానాలు, రైతు సహకార సంఘాల పరిస్థితి, శ్రీగంధం సాగు, హైడ్రో ఫోనిక్ పద్దతిలో ఆకుకూరల సాగు, పాలీ హౌస్‌లో తీగ జాతి టమాటా, క్యాప్సికమ్, బీర సాగు పద్దతులు, తమిళనాడు హోసూరులో వెదురు సాగు, మాండ్య జిల్లా రాంనగర్‌లో దేశంలోనే అతిపెద్ద సెరికల్చర్ మార్కెట్, మద్దూరు తాలూకా కెస్తూరులో యువరైతులు రాజు, కుమార్, శశి, వినోద్ లు సాగు చేస్తున్న మల్బరీ సాగు, పట్టుపురుగుల సాగు అంశాలను పరిశీలించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
కర్ణాటక ఉద్యాన విధానాలు, ప్రపంచవ్యాప్త డిమాండ్, దానికి తీసుకోవాల్సిన చర్యలను సీఎస్ఐఆర్- సీఎఫ్‌టీఆర్ఐ సంస్థ డైరెక్టర్‌లు వివరించారు. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ హెడ్ డాక్టర్ విజయానంద్ మాట్లాడుతూ.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలపై ప్రశంసలు కురిపించారు. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరంటు ఇవ్వడమే కాకుండా పంట కాలనీల ఆలోచన బాగుందని, ఉద్యాన రంగంలో రైతులను ప్రోత్సహించాలన్న విధానం ప్రశంసనీయమన్నారు. ఉద్యాన సాగులో పాలీ హౌస్, గ్రీన్ హౌస్ సాగులను ప్రోత్సహించండి.. రెడ్, ఎల్లో క్యాప్సికమ్, బ్రొకోలి, టమాటా పంటలు పండించవచ్చు అని తెలిపారు. ఉద్యాన ఉత్పత్తులు, మార్కెట్ డిమాండ్లను వివరించారు.తెలంగాణలోని వివిధ జిల్లాలలో వివిధ పంటల సాగు, వాటి అనుబంధ ఉత్పత్తుల అవకాశాలపై వివరణ ఇచ్చారు.
మైసూరు సీఎస్ఐఆర్- సీఎఫ్‌టీఆర్ఐలో జరిగిన సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు సీఎస్ఐఆర్- సీఎఫ్‌టీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి ఎ సింగ్, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, సీఎస్ఐఆర్- సీఎఫ్‌టీఆర్ఐ టెక్నాలజీ హెడ్ డాక్టర్ రాజేష్, ఫుడ్ సేఫ్టీ, క్వాలిటీ కంట్రోల్ హెడ్ డాక్టర్ అలోక్ శ్రీవాత్సవ పాల్గొన్నారు, అంతకుముందు మాండ్య జిల్లా రాంనగర్‌లో దేశంలోనే అతిపెద్ద సెరికల్చర్ మార్కెట్, మద్దూరు తాలూకా కెస్తూరులో యువరైతులు రాజు, కుమార్, శశి, వినోద్ లు సాగు చేస్తున్న మల్బరీ సాగు పరిశీలించారు.