బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ మేరకు మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేసిన నిరంజన్ రెడ్డి…ఆర్డీఎస్ కొన తెల్వదు .. మొన తెల్వదని దుయ్యబట్టారు. బండికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు తెల్వవు .. రిజర్వాయర్లు తెల్వవని…ప్రజలు బండి సంజయ్ తీరు చూసి నవ్వుకుంటున్నారన్నారు.
ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏ పనులు చేపడతావ్ ? ఎక్కడ నుండి నిధులు తెస్తావో ప్రజలకు వివరాలు వెల్లడించాలన్నారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, డీకె అరుణ కర్ణాటక బీజేపీ ఇంచార్జ్. ఇద్దరూ కలిసి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు కర్ణాటకను ఒప్పించి సాగునీరు తెచ్చే దమ్ముందా ? అని ప్రశ్నించారు.
ఆర్డీఎస్ కాలువను నిజాం ప్రభుత్వం ప్రతిపాదించింది. 1946లో మొదలై ఇది 1958లో పూర్తయింది. తుంగభద్ర నదిపై రాయచూర్ జిల్లా మాన్వి వద్ద నిర్మించిన అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు ఇది. 93,379 ఎకరాలు దీని పూర్తి ఆయకట్టు….కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ 1 ఆర్డీఎస్ కు 17.1 టీఎంసీల నీటిని కేటాయించింది. 142 కిలోమీటర్లు ఆర్డీఎస్ ప్రధాన కాలువ పొడవు. మొదటి 42 కిలోమీటర్లు కర్ణాటకలో , తదుపరి 100 కిలో మీటర్లు తెలంగాణలో ప్రవహిస్తుంది. దీని ద్వారా అలంపూర్ నియోజకవర్గానికి తాగునీరు, సాగునీరు అందించడం ప్రధాన ఉద్దేశం అన్నారు.
కానీ ఆర్డీఎస్ కాలువ ద్వారా ఎన్నడూ కర్ణాటక సంపూర్ణంగా నీరిచ్చిన ధాఖలాలు లేవు. అలంపూర్ తాలూకాలలో 87,500 ఎకరాల ఆయకట్టుకు 15.9 టీఎంసీల నీరందించాలి. కానీ ఇప్పటి వరకు ఎన్నడూ 20 వేల ఎకరాలకు నీళ్లు పారలేదన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు మద్దతుగా 2003 జులై 16 అలంపూర్ జోగుళాంబ ఆలయం వద్ద మొదలుపెట్టి జులై 25 వరకు కేసీఆర్ పాదయాత్ర నిర్వహించారు. గద్వాలలో లక్ష మందితో బహిరంగసభ నిర్వహించి పాదయాత్ర విరమించారన్నారు.
వెనువెంటనే 2003 ఆగస్టు నెలలో ఆర్డీఎస్ ఆయకట్టు రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై ఉమ్మడి రాష్ట్రంలోని ఎంపీలు అందరికీ కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు.కేసీఆర్ తీసుకున్న ఈ చర్యల ద్వారానే ఆ తర్వాతనే ఆర్డీఎస్ సమస్యపై 2004 లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. ఆ కమిటీ తెలంగాణకు ఆర్డీఎస్ ద్వారా సాగునీరు అందడం లేదని నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 2014 వరకు ఎటువంటి చర్యలు లేవు. అనేకమార్లు టీఆర్ఎస్ ఆర్డీఎస్ ఆయకట్టుపై ఉద్యమించిందన్నారు.
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైన్ చేస్తున్న నేపథ్యంలో ఆర్డీఎస్ మీద సంపూర్ణ సమీక్ష నిర్వహించారు..దీనికి సంబంధించి 2017లో తెలంగాణ ప్రభుత్వం జీఓ 429 విడుదల చేస్తూ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రూ.780 కోట్లతో చేపట్టి కేవలం పది నెలలలో పూర్తిచేసింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్లను ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్లకు సంబంధించిన సర్వే పూర్తయిందన్నారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్డీఎస్ కాలువ కింద సాగునీరందని 50 వేల ఎకరాలకు నీరందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు ఇస్తానన్న మాటను తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నిలబెట్టుకున్నారు…పుట్టిన నడిగడ్డను, తెలంగాణను గాలికి వదిలి ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం చేసి దోచుకుపోయిన హాంద్రీనీవా నీళ్లకు హారతిపట్టిన డీకె అరుణను పక్కనపెట్టుకుని బండి సంజయ్ ఆర్డీఎస్ ఆయకట్టు గురించి మాట్లాడడం హస్యాస్పదం అన్నారు.
మొన్న వడ్లు కొంటాం .. రైతులు వరి వేయాలి .. కేంద్రంలో ఉన్నది మా ప్రభుత్వం అన్నావ్ .. వరి పంట కోతకొచ్చాక మొకం చాటేశావ్ అని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి లొల్లిపెట్టినా కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయమనడంతో రైతుల బాధలు తెలిసిన కేసీఆర్ తామే కొంటామన్నారు…కేసీఆర్ వడ్లు కొంటాం అని ప్రకటించగానే అది మా విజయం అని సిగ్గులేకుండా ప్రకటించుకున్నావ్ అన్నారు.