2 రోజుల్లో రైతుబంధు రూ.1669.42 కోట్లు జమ: నిరంజన్ రెడ్డి

130
niranjan reddy
- Advertisement -

రైతుబంధు పంపిణీలో భాగంగా రెండవ రోజు (ఈరోజు) 15.07 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1152.46 కోట్లు జమచేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తొలిరోజు (నిన్న) రైతుబంధు పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 16,95,601 మంది రైతులకు రూ. 516.95 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసిందని ఆయన వెల్లడించారు. రెండు రోజులలో రూ.1,669.42 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేశామని అన్నారు.

ఇక రేపు 17తేదీన మూడవ రోజు 10.40 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1272.85 కోట్లు జమకానున్నాయి. మూడు రోజులలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు జమకానున్నాయన్నారు. మూడో రోజు నల్లగొండకు అత్యధికంగా 79,727 మంది రైతులకు రూ.98.29 కోట్లు అందుతాయి. అలాగే అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 3701 మంది రైతులకు రూ.4.45 కోట్లు జమ చేయనున్నామని మంత్రి తెలిపారు.

ఈ నెల 25 వరకు రైతులకు రైతుబంధు నిధుల పంపిణీని పూర్తి చేస్తామని అన్నారు. కాగా, రైతులు పత్తి, కంది అధికంగా సాగు చేయడంతో పాటు పప్పు దినుసులు, నూనెగింజల పంటల సాగును పెంచాలని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతాంగం దృష్టి సారించాలి మంత్రి కోరారు.

- Advertisement -