వనపర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలోని పావు ఎకరంలో ప్రయోగాత్మకంగా ఆలుగడ్డ సాగు చేస్తున్నారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ ఆయన ఆలుగడ్డ పంటను పరిశీలించి.. దిగుబడి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గరిష్టంగా ఎకరానికి 100 నుంచి 120 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెప్పారు. ఏడాది పొడవునా క్వింటాలు ధర రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉంటున్నదని తెలిపారు. ఒక్కోసారి క్వింటాలుకు రూ.2 వేలు కూడా పలుకుతుందన్నారు. పెట్టుబడి పోను రైతుకు ఎకరానికి రూ.లక్ష వరకు మిగులుతుందని చెప్పారు.
మన నేలలు, వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలమని, ప్రస్తుతం మార్కెట్లో ఆలూకి మంది డిమాండ్ ఉందని మంత్రి అన్నారు. ఆలుగడ్డ ధర కూడా స్థిరంగా ఉంటుందని చెప్పారు. దేశంలో అత్యధిక శాతం మంది తినే కూరగాయలలో ఆలుగడ్డ ఒకటని వెల్లడించారు. అందువల్ల రైతులు ఆలుగడ్డ సాగువైపు మళ్లాలని సూచించారు. ఎకరా ఆలుగడ్డ సాగుకు రూ.45 వేల దాకా ఖర్చవుతుందని, మొక్క నాటాక 85-90 రోజుల్లో పంట కోతకు వస్తుందని వెల్లడించారు. పంటకాలం పెరిగితే దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ఆలూని పెద్దగా సాగుచేయక పోవడంతో ఉత్తర భారతదేశంపై ఆధారపడాల్సి వస్తుందని మంత్రి చెప్పారు.