కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నేపథ్యంలో మార్కెట్లలో జాగ్రత్త చర్యలను తెలిపేలా పోస్టర్లను ప్రదర్శించండి. రద్దీగా ఉన్న మార్కెట్లలో స్థానిక మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకుని పరిశుభ్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
మార్కెట్లలో మంచినీటి కేంద్రాలు, ఆహారకేంద్రాలు, మరుగుదొడ్ల వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మార్కెట్లలో జనసామర్ధ్యం రోజువారీగా ఎక్కువగా ఉంటుంది అందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.మర్కెటలో హమాలీలు, రైతులు, చాటకూలీలు తరచుగా ఒకేచోట గుమికూడకుండా చూడండి. ఉదయాన్నే మార్కెట్లకు రైతులు వస్తుంటారు .. వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు నీళ్లు, సబ్బులు అందుబాటులో ఉంచండి. మార్కెట్లలోని మైకుల ద్వారా తరచుగా జాగ్రత్త చర్యలు ప్రచారం చేయాలి మంత్రి సూచించారు.
రాష్ట్రంలో నిత్యం రైతులు, వినియోగదారులతో రద్దీగా ఉండే రైతుబజార్లు, గడ్డిఅన్నారం, బోయిన్ పల్లి, మలక్ పేట, గుడిమల్కాపూర్, మిర్యాలగూడ, ఎనుమాముల, ఖమ్మం, జమ్మికుంట, గజ్వేల్, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్ మార్కెట్లలో ఖచ్చితంగా జాగ్రత్త చర్యలు పాటించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.