ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.ఆదివారం ఆయన తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భారత రైతాంగం తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు పలుకుతుంది. మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు అని మంత్రి తెలపారు. ఈ దేశ రైతాంగానికి దారి చూపే శక్తి తెలంగాణ నుండి కేసీఆర్ రూపంలో ఉంటుందని భావిస్తున్నాం. రైతాంగాన్ని ఆత్మ విశ్వాసంతో నిలిపింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. వ్యవసాయరంగం మీద దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దీనిమూలంగానే తెలంగాణ స్థిరపడినం, బలపడినం. కేంద్ర నిర్ణయాలు దేశానికి ఉపయోగపడతాయి అనుకుంటే వ్యవసాయ చట్టాలు రైతుపై పిడుగులా పడ్డాయి. వ్యవసాయ చట్టాలలో ఏ మాత్రం రైతు కోణం లేదని మంత్రి మండిపడ్డారు.
దేశంలో వివిధ సంస్థలు అమ్మిన కేంద్రం.. ఇప్పుడు కీలకమైన ఆహారరంగం మీద దృష్టిపెట్టింది.. దీనిని కార్పోరేట్ కు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుంది. ధాన్యానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అదనపు ధర ఇస్తే కొనుగోళ్లు ఆపేస్తామని కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తున్నది. రాష్ట్రం అదనపు ధర ఇస్తే అభినందించాల్సింది పోయి అడ్డుకుంటుందని మంత్రి విమర్శించారు. తెలంగాణ పత్తి దేశంలో నంబర్ వన్ అని, అక్కడ పండిన పంట అంతా కొంటాం అని సీసీఐ తెలిపింది. కానీ ఇప్పుడు కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులే రావాలి, వారి రక్తసంబంధీకులే రావాలి అని నిబంధన పెట్టారు. ఇది రైతులను ఇబ్బంది పెట్టడమే. రాష్ట్రంలో కోటీ 3 లక్షల ఎకరాలలో గత వానాకాలం, యాసంగిలో వరి పండింది. ప్రాజెక్టులన్నీ పూర్తయితే ప్రతి సీజన్ కు కోటి ఎకరాలలో వరి సాగయ్యే అవకాశం ఉందన్నారు.
పెరుగుతున్న వ్యవసాయ దిగుబడులను ప్రోత్సహించాల్సిన కేంద్రం కార్పోరేట్లకు లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటుంది. కేంద్రంతో పోరాడుతున్న రైతాంగానికి టీఆర్ఎస్, తెలంగాణ యావన్మంది రైతాంగం మద్దతు తెలుపుతున్నాయి. ఈ నెల 8న ప్రతి గ్రామంలో రైతులు కేంద్ర వ్యవసాయ చట్టాలపై చర్చ చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.