రైతుల సంఘటిత శక్తి అద్భుతాలు సృష్టిస్తుంది..

180
Minister Niranjan Reddy
- Advertisement -

రైతుల సంఘటిత శక్తి అద్భుతాలు సృష్టిస్తుంది. అందుకే తెలంగాణలో కేసీఆర్ రైతుబంధు సమితిలను ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం మంత్రి నిరంజన్‌ రెడ్డి నాలుగోరోజు పూణె సమీపంలో బారామతి వద్ద సోమేశ్వర రైతు సహకార చక్కెర కార్మాగారం సందర్శించారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంచాయతీరాజ్, సహకార రంగాలు ప్రజలు, రైతుల పాత్రతో అద్భుత విజయాలు సాధించాల్సింది. పంచాయతీరాజ్‌లో ప్రజల పాత్ర, సహకార రంగంలో రైతుల పాత్ర లేకుండా గత పాలకులు మూస ధోరణిలో వ్యవహరించారు. దీంతో పంచాయతీ రాజ్, సహకార స్ఫూర్తి అమలుకాలేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చి నిధులిచ్చి పల్లెలను వికసింపజేస్తున్నారని మంత్రి తెలిపారు.

పంచాయతీరాజ్ ఉద్యమం తెలంగాణలో పునంప్రారంభమయింది. రైతులను సమీకృతం చేసి సహకార వ్యవసాయం సమిష్టిగా ముందుకు తీసుకుపోవడం నేటి అవసరం. మహారాష్ట్ర సహకార రంగంలో రైతుల పాత్ర అద్వితీయం అన్నారు. వారి పాత్ర మూలంగానే వందలాది చక్కెర కార్మాగారాలు విజయవంతంగా సాగుతున్నాయి.. ఏటా చెరుకు సాగు పెరిగి రైతులకు లాభాలు అర్జించి పెడుతున్నది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడి లేకుండా రైతులే సహకార సంఘాలుగా ఏర్పడి అనేక కార్మాగారాలు నడిపిస్తున్నారు. పంట, పరిశ్రమ, యాజమాన్యం, అమ్మకం, లాభాలు అన్నీ రైతులవే.. ఇది సహకార సంఘాలుగా ఏర్పడి విజయం సాధించిన రైతుల గాధ అని మంత్రి కొనియాడారు.

తెలంగాణలో ఉచిత కరంటు, సాగునీరు, పంటకు పెట్టుబడి, రైతుభీమా వంటి అద్భుతమైన చేయూతను తెలంగాణ ప్రభుత్వం రైతుకు అందిస్తున్నది. అధిక ఉత్పత్తి, సమీకృత మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలంటే రైతుబంధు సమితులు క్రియాశీలకంగా వ్యవహరించి రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చాలి. సాంకేతిక పరిజ్ఞానం వాడకంలో, యంత్ర సామాగ్రి వినియోగంలో, విత్తనాలు, ఎరువుల కొనుగోలులో, రైతుల ఉత్పత్తుల అమ్మకాలలో ఎక్కడికక్కడ సామూహిక విధానాలను అమలుపరుచుకోవాలి. దానిమూలంగా నికరమైన లాభార్జనతో వ్యవసాయం సాగుతుందని మంత్రి పేర్కొన్నారు.

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం బారామతి సమీపంలోని సోమేశ్వర రైతు సహకార చక్కెర కార్మాగారం సందర్శన చేశాం. 27 వేల మంది రైతులు సమిష్టిగా చెరుకు పండించి వారే తమ సహకార పరిశ్రమలో చక్కెర, ఇథనాల్, కరంటు తయారు చేసి అధిక లాభాలు అర్జిస్తున్నారు. మహారాష్ట్రలో అభివృద్ధి చెందిన వ్యవసాయానికి శరద్ పవార్‌ను రైతులు అద్యుడిగా చూస్తారు. మహారాష్ట్రలో బలపడ్డ రైతుల సహకార వ్యవస్థ, సహకార పరిశ్రమలు, వ్యవసాయ విద్య, కృషి విజ్ఞాన కేంద్రాల్లాంటి నూతన ఒరవడులు సాగులో పవార్ కృషికి ఎల్లప్పుడూ సాక్షీబూతంగా నిలుస్తాయని మంత్రి ప్రశంసించారు.

బారామతిలోని నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు, పద్మవిభూషణ్, మరాఠా యోధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌తో భేటీ అయ్యారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.ఈ నేపథ్యంలో వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుండడంపై ఆనందం పవార్ వ్యక్తంచేశారు.. కేసీఆర్ యోగక్షేమాలు, ఇటీవల కురిసిన వర్షాలు, పంటల పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణ ఏర్పాటుకు తను, తన పార్టీ అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్న పవార్. తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేయడం పట్ల సంతోషం.. మరింత పురోగమించాలని పవార్‌ సూచించారు. తెలంగాణ అభివృద్ధికి అద్భుతమైన హైదరాబాద్, సాగునీటి వసతి గలిగిన గ్రామీణ ప్రాంతాలు ఎంతో దోహదపడతాయన్నారు పవార్.

భేటీ అనంతరం తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డితో జరిగిన భేటీలో ‘వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలు మరియు సవాళ్లను మేము చర్చించాము మరియు రైతు అనుకూల పథకాలు మరియు వ్యవసాయ అభివృద్ధికి వినూత్న వ్యవసాయ పద్ధతులపై మా అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నామని’ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు శరద్ పవార్.

- Advertisement -