రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆయిల్ పామ్ సాగుకు అవకాశాలపై అధ్యయనానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలతో కూడిన కమిటీతో రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణాకేంద్రంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సమవేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి, ఉద్యానశాఖ కమీషనర్ వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు. నేటి నుండి ఈ నెల 30 వరకు ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించి ఆయిల్ పామ్ సాగు అవకాశాలపై కేంద్రానికి నివేదిక సమర్పించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పామ్ ఆయిల్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తుంది. ఎకరా వరి సాగయ్యే నీటితో మూడెకరాల పామ్ ఆయిల్ సాగు అవుతుంది. అంతరపంటల సాగుతో అధిక లాభాలు వస్తాయి. ప్రపంచంలో వంటనూనె పరిశ్రమలలో భారత్ ది నాలుగోస్థానం. పామ్ ఆయిల్ సాగులో దేశంలో తెలంగాణది రెండో స్థానం. ఈ పంటకు చీడపీడలు, కోతులు, రాళ్లవాన, దొంగల బెడద ఉండదు. పామ్ ఆయిల్ కంపెనీలే నేరుగా కొనుగోలు చేయడం మూలంగా ప్రతి నెలా ఆదాయం వస్తుంది. వంటనూనెలలో తక్కువధరకు లభిస్తుండడం మూలంగా భారతదేశంలో పామాయిల్ వాడకం ఎక్కువగా ఉంది.
దేశంలోని అవసరాల ప్రకారం 21 మిలియన్ టన్నుల వంటనూనెలు అవసరం. ఉత్పత్తి మాత్రం 7 మిలియన్ టన్నులు మాత్రమే అవుతుంది. రూ.75 వేల కోట్లు వెచ్చించి దేశంలోకి వంటనూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మొత్తం దిగుమతులలో 60 శాతం పామాయిల్ కావడం గమనార్హం. 8.4 మిలియన్ టన్నుల పామాయిల్ ను రూ.40 వేల కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. దేశంలో మరో 28 లక్షల హెక్టార్లలో పామాయిల్ సాగును చేపట్టడం ద్వారా ఈ దిగుమతిని అరికట్టవచ్చును.
2017 – 18 గణాంకాల ప్రకారం కర్నాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మిజోరాం, ఒరిస్సా రాష్ట్రాలలో దాదాపు 3.04 లక్షల హెక్టార్లలో పామాయిల్ సాగవుతుంది. 2.65 లక్షల టన్నుల పామాయిల్ దిగుబడి వస్తుంది. రూ.40 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని అరికట్టాలంటే పామాయిల్ దిగుమతి తగ్గించుకుని దేశంలో అయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. దేశంలో అయిల్ పామ్ సాగుకు అనుకూలమైన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. రాష్ట్రంలోని ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో దాదాపు 50 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగవుతుంది.
తెలంగాణలో హెక్టారుకు 15 టన్నుల నుండి అత్యధికంగా 25 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.తెలంగాణలో తలసరి 16 కిలోల అయిల్ వినియోగం ప్రకారం 6.4 లక్షల మెట్రిక్ టన్నుల నూనె అవసరం అవుతుంది. రాష్ట్ర అవసరాలకన్నా వంటనూనె ఉత్పత్తి 3 లక్షల టన్నులు తక్కువగా ఉంది. అందులో పామాయిల్ వాటా 1.80 లక్షల టన్నులు. ప్రస్తుతం 80 వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఆయిల్ పామ్ సాగును మరో లక్ష ఎకరాలు పెంచడం మూలంగా పామాయిల్ దిగుమతులను అరికట్టవచ్చు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ ప్రాసెసింగ్ మిల్లు సామర్ధ్యం గంటకు 15 టన్నుల నుండి 30 టన్నులకు పెంచడం జరిగింది. దీంతో పాటు దమ్మపేట మండలం అప్పారావుపేటలో గంటకు 30 టన్నుల ప్రాసెసింగ్ సామర్ధ్యంగల కొత్త మిల్లును రూ.10 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సూక్ష్మసేద్యానికి షెడ్యూలు కులాలు, తెగల రైతులకు 100 శాతం, బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరకు 80 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
దీంతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయానికి సాగునీటిని అందించడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు సరఫరా, రైతులకు ప్రోత్సాహం కింద ఎకరాకు ఏడాదికి రూ.10 వేల పంట పెట్టుబడి ఇచ్చే రైతుబంధు పథకంతో పాటు రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తూ రైతుభీమా పథకం అమలుచేయడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న నాలుగు జిల్లాలతో పాటు ఇతర జిల్లాలలో ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన జిల్లాలను సర్వే చేయించగా తెలంగాణలోని 18 జిల్లాలలో 206 మండలాలలో 2.78 లక్షల హెక్టార్ల భూమి ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం అని తేలింది.
కొత్తగా సర్వేలో వెల్లడయిన ప్రాంతాలలో ఆయిల్ పామ్ సాగుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి లేఖ రాయడం జరిగింది. ఈ నెల 26న తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లాల నుండి ఆసక్తి గల వెయ్యి మంది అభ్యుదయ రైతులను కొత్తగూడెం జిల్లాకు తీసుకెళ్లి ఆయిల్ పామ్ తోటలను, ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీని చూయించి ఆయిల్ పామ్ సాగుపై క్షేత్రస్థాయి అవగాహన కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు.
Meeting with Re-assessment Committee,Government of India for Identification of Potential Oilpalm area in Telangana State..