పర్యావరణాన్ని పరిరక్షించడం వ్యవసాయం ద్వారానే సాధ్యం అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జగిత్యాల జిల్లా పొలాసలో వ్యవసాయ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు మంత్రి. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ భూమండలాన్ని పచ్చగా ఉంచే శక్తి వ్యవసాయానికే ఉంది. ఇతర కార్యాకలాపాలన్నీ పర్యావరణాన్ని నాశనం చేసేవే అన్నారు. ఒకప్పుడు ఎంత పొలం ఉంది అని అడిగి పిల్లనిచ్చేది. కానీ ఇప్పుడు వ్యవసాయం చేస్తుండే అంటే పిల్లను ఇవ్వడం లేదు. ఈ రోజు వ్యవసాయం చేస్తున్నాం అని చెప్పుకునే ధైర్యాన్ని సీఎం కేసీఆర్ తీసుకువచ్చారు. రాజ్యం అంతా రైతు వైపు చూసే పరిస్థితిని కేసీఆర్ సృష్టించారని తెలిపారు.
కేవలం మూడు సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. వ్యవసాయ విద్యార్థులు మిగతా విద్యార్థులకు చాలా తేడా ఉందన్నారు. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో కూడా కొంత మంది విద్యార్దులకు తెలియదన్నారు. ఈ భూమి తల్లి విలువ తెలిసిన మట్టిబిడ్డలు వ్యవసాయ విద్యార్థులు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన విద్యను విద్యార్థులకు అందించాలని నూతన వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. జగిత్యాల ప్రాంతంలో అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనందిస్తామని మంత్రి తెలిపారు.