కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన 763 మంది రైతులకు రూ.3 లక్షల చొప్పున ముఖ్యమంత్రి కేసీఆర్ పరిహారం ప్రకటించడంపై తెలంగాణ రైతులను పట్టించుకోలేదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దుష్ప్రచారం చేయడాన్ని ఒక ప్రకటనలో తప్పుపట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మూడేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.3384.95 కోట్ల రైతుభీమా పరిహారం ఇచ్చింది.. రూ.5 లక్షల చొప్పున 67,699 మంది రైతు కుటుంబాలకు లబ్ది చేకూర్చాము అన్నారు.
ప్రపంచంలో రైతుభీమా, రైతుబంధు వంటి పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి.. అందుకే రైతు ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సాయం అందేలా రైతుభీమాకు రూపకల్పన చేశారు.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సాయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేయడం, తెలంగాణ రైతులను పట్టించుకోలేదని ప్రచారం చేయడం సిగ్గు చేటు అని మంత్రి మండిపడ్డారు.
ముందు రైతుభీమా, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు సరఫరా దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలుచేసి మాట్లాడాలి. దశాబ్దాలుగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి, తెలంగాణ రైతులను వలసబాట పట్టించింది కాంగ్రెస్ పార్టీ.. రైతులకు కాంగ్రెస్, బీజేపీలు ఎన్నడూ ఏకాణ సాయం చేసిన పాపాన పోలేదు అని విమర్శించారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు స్వర్ణయుగం. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరంటుతో పాటు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నాం అన్నారు.
సాగునీరే కాదు కాంగ్రెస్ పాలనలో కనీసం ఎరువులు, విత్తనాలు కూడా దొరక్క రైతులు పోలీస్ స్టేషన్లలో పడిగాపులు కాసి లాఠీదెబ్బలు తినేది.. అన్నం పెట్టే రైతు మరణిస్తే ఆ కుటుంబం అనాధ కాకూడదని, వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబాలకు ధైర్యం ఉండాలన్న ముందుచూపుతో కేసీఆర్ రైతుభీమా ప్రవేశపెట్టారు. 2021 – 22 సంవత్సరానికి 35.64 లక్షల మంది రైతులకు రైతుభీమా ప్రీమియం చెల్లించడం జరిగింది. ఏడాదికి దాదాపు రూ.60 వేల కోట్లు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..కేసీఆర్ నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనం అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.