పీఎమ్ కిసాన్ యోజన ఇచ్చేది తక్కువ .. ప్రచారం ఎక్కువ:నిరంజన్ రెడ్డి

52
niranjan reddy
- Advertisement -

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో కొత్తవారికి నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేసారు. ఈ సంధర్బంలో మాట్లాడుతూ…ప్రధానమంత్రి కిసాన్ ‘ఘాఠా‘ యోజన అని ప్రస్తావించారు. రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు లబ్దిపొందుతున్నారు, అదే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద మాత్రం ఏడాదికి రూ.6 వేలు వస్తున్నది కేవలం 35.74 లక్షల మందికే. రైతుబంధు పథకం కింద ఈ వానాకాలం సీజన్ తో కలుపుకుంటే రూ.58 వేల కోట్ల నిధులు  తెలంగాణ రైతుల ఖాతాలలోకి జమ కానున్నాయి. కాని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇప్పటి వరకు రైతులకు అందింది రూ.7689 కోట్లు మాత్రమే అని తెలిపారు.

“ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో కొత్తవారి నమోదుకు అవకాశం లేదు .. 1 ఫిబ్రవరి 2019 తర్వాత కొత్తగా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు .. 2024 వరకు కొత్తవారికి నో ఛాన్స్. ఆదాయం పన్ను కట్టినా, రూ.పది వేల పెన్షన్ వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, పదవీ విరమణ చేసినా, తమ తమ అసోసియేషన్లలో నమోదు చేసుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆర్కిటెక్ట్ లు, ఛార్టెడ్ అకౌంటెట్లు ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజనకు అనర్హులు. రైతుబంధు గురించి, రైతుల ప్రయోజనాల గురించి రంకెలు వేసే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు ?  తెలంగాణ రైతుల్లో కొత్తవారికి కూడా ఈ పథకం వర్తించేలా ఎందుకు కృషిచేయరు?” అని ప్రశ్నించారు.

“కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ఇచ్చేది కేవలం రూ.2200 కోట్లకు మించింది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయరంగానికి గరిష్టంగా కేటాయించిన బడ్జెట్ ఎన్నడూ రూ.3 వేల కోట్లకు మించలేదు. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఏడాదికి రూ.15 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి వేస్తున్నారు .. రూ.1500 కోట్లు రైతుభీమా కోసం ఖర్చు చేస్తూ రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. గతంలో వ్యవసాయ రంగ పథకాలు అన్నీ కలిపితే ఒక మండలంలో లబ్దిదారులు కేవలం 200 నుండి 500 లోపు మాత్రమే ఉండేవారు. రైతుబంధు పథకం ద్వారా భూమి ఉన్న ప్రతి రైతుకు నేరుగా సాయం అందుతున్నది .. అటవీ చట్టం ఆధీనంలో ఉన్న రైతుల భూములకు కూడా రైతుబంధు సాయం అందించడం జరుగుతున్నది. రైతుబంధు సాయం నేరుగా రైతుల ఖాతాలలో వేయడం మూలంగా రైతులు ఆ డబ్బులను తన వ్యవసాయ అవసరాల మేరకు వాడుకునే అవకాశం ఉన్నది” అని వాక్యానించారు.

“కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇచ్చేది తక్కువ .. ప్రచారం ఎక్కువ. కేంద్రం అడ్డగోలు నిబంధనల మూలంగా ప్రతి విడతలో 30 లక్షల మంది తెలంగాణ రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ప్రయోజనాలు అందడం లేదు. ఎరువుల మీద సబ్సిడీలు తగ్గిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు .. ఎనిమిదేళ్లలో ఎరువులు, రసాయనాల ధరలు రెట్టింపు అయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ వ్యవసాయరంగంలో యంత్రాల వినియోగంపై భారం మోపుతున్నారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ .. రైతుల పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేయడంలో విజయవంతం అయ్యారు. బీజేపీ నేతలు మందికి సుద్దులు చెప్పడం మానేసి ప్రధానమంత్రికి చెప్పి రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో నిబంధనలు వెంటనే సడలించాలి .. ప్రతి రైతుకూ ఈ పథకం వర్తింపజేయాలి” అని డిమాండ్ చేశారు.

- Advertisement -