తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు స్ధానం లేదన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ హామీలు, నేతల ప్రసంగాలపై స్పందించిన నిరంజన్ రెడ్డి…తెలంగాణ రాష్ట్రం బిక్ష కాదు .. పోరాడి లాక్కున్నాం అని తెలిపారు. కాంగ్రెస్ పదే పదే తెలంగాణ పోరాటాలను అవమానిస్తుందని…తెలంగాణలో ఆత్మబలిదానాలు రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ చేసిన కాలయాపన ఫలితమే అన్నారు.
కేసీఆర్ ఆమరణదీక్షకు దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన కాంగ్రెస్ ఆంధ్రా లాబీకి తలొగ్గి ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకుందని గుర్తుచేశారు. డిసెంబరు 23, 2009 నుండి జూన్ 2, 2014లో రాష్ట్ర ఏర్పాటు వరకు కేసీఆర్ తెలంగాణలో సబ్బండ వర్గాలను ఏకతాటిపై నిలబెట్టి వివిధ రూపాలలో ఉద్యమాన్ని పట్టు సడలకుండా నిలబెట్టడంతో రాజకీయ అస్తిత్వం కోసమే కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చిందన్నారు.
ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో బుద్ది చెప్పి ఉద్యమించిన కేసీఆర్ కు అండగా నిలిచారని…భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణను బలిపెట్టింది కాంగ్రెస్ అని ఆరోపించారు. కాంగ్రెస్ చర్యలతో తెలంగాణ రెండు తరాల భవిష్యత్ ను కోల్పోయిందని…48 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో వివక్ష, అసమానతల ఫలితమే తెలంగాణలో దుర్భిక్షం అన్నారు. తెలంగాణను ఎండబెట్టి, ప్రజలను వలసల పాలు చేసి ఆంధ్రాకు నీటిని తరలించారన్నారు.
కాంగ్రెస్ పాలనలో వైఫల్యాల మూలంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని..ఒంటె పెదవులకు నక్క ఆశపడ్డట్లు .. అలవిగాని హామీలు ప్రజల ముందు పెట్టి అధికారం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతుందన్నారు. తుక్కుగూడ సభలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలుచేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
Also Read:గ్రీన్ ఛాలెంజ్‌కు పర్యావరణవేత్త ఏరిక్ సోల్హెమ్ మద్దతు