అభివృద్ధి అంటే ఏంటో తెలంగాణ వచ్చిన తర్వాత, సీఎం కెసిఆర్ వచ్చాకే తెలిసిందన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డి. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి అంటే ఏంటో తెలంగాణ వచ్చిన తర్వాత, సీఎం కేసీఆర్ వచ్చాకే తెలిసిందని.. 8 ఏండ్ల ముందు తెలంగాణ రాకుముందు ఉన్న పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు ఒకసారి బేరీజు వేసుకోండని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు జూటా పార్టీలు. వాళ్ళు చెప్పేదొకటి… చేసేదొకటి. వాళ్ళు వస్తె… మనకు ఇప్పుడు వస్తున్న పథకాలను తీసివేస్తరు. వాళ్ళను నమ్మొద్దని మంత్రి అన్నారు. ప్రస్తుతం జరగుతున్న అభివృద్ధి , సంక్షేమాలను మంత్రి మల్లారెడ్డి ప్రజలకు వివరించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం… మన పల్లెలను ప్రగతి పథంలో నడిపించుకుందామని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రులు డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రులకు మహిళలు బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. పులి వేశాలతో పలువురు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.