రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి ఫైర్‌..

139
minister mallareddy
- Advertisement -

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ర‌చ్చ‌బండ పేరుతో రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి.. మంగళవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి రేవంత్‌రెడ్డి తనపై తన కుటుంబంపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఉద్దేశ్యపూర్వకంగానే తమ కుటుంబంపై రేవంత్ రెడ్డి బురద చల్లుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ రెడ్డి అంటూ మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రైతుల‌ను మోసం చేసిన పార్టీ.. నేడు రైతుల గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు ఎద్దేవ చేశారు. రేవంత్‌ది ర‌చ్చ‌బండ కాదు.. లుచ్చా బండ‌.. బ‌ట్టేబాజ్ బండ అని మల్లారెడ్డి ధ్వజమెత్తారు.. రేవంత్ ఏ పార్టీలో ఉంటే అది మ‌టాష్ అని అన్నారు. ఆయ‌న ఏ పార్టీలో కూడా ఎక్కువ కాలం ప‌ని చేయ‌రు. రేపోమాపో రేవంత్ బీజేపీలో చేరినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

టీడీపీలో ఉన్న‌ప్పుడు త‌న‌ను రేవంత్ రెడ్డి 24 గంట‌లూ బ్లాక్ మెయిల్ చేశార‌ని మ‌ల్లారెడ్డి గుర్తు చేశారు. ఎంపీగా గెలిచిన త‌ర్వాత కూడా బ్లాక్ మెయిల్ ఆప‌లేదని పేర్కొన్నారు. పైసలు ఇస్తావా.. లేదంటే కాలేజీలు మూసివేయించాలా? అని త‌న‌ను బెదిరించార‌ని మ‌ల్లారెడ్డి తెలిపారు. అందర్నీ బ్లాక్ మెయిల్ చేసే అలవాటున్న రేవంత్ రేపు రాహుల్ గాంధీని కూడా బ్లాక్ మెయిల్ చేస్తారని చెప్పారు. తాను పాలు అమ్మి, క‌ష్ట‌ప‌డి ఆస్తులు సంపాదించాను.. మ‌రి రేవంత్ ఏ ప‌ని చేసి ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించాడు? అని ప్ర‌శ్నించారు.

రేవంత్ కూతురి వివాహానికి డ‌బ్బులు ఎవ‌రు ఇచ్చారో ఆయ‌న చెప్పాల‌ని మంత్రి మ‌ల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఆయ‌న బిడ్డ పెళ్లికి తాను డ‌బ్బులు ఇచ్చాన‌ని మ‌ల్లారెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా తాను డబ్బులు ఇవ్వలేదని రేవంత్ ప్రమాణం చేస్తారా? అని స‌వాల్ విసిరారు. రేవంత్ ది అంతా సినీ ఫక్కీ రాజకీయమ‌ని మండిప‌డ్డారు.

రెడ్డి సామాజిక వర్గంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్వంత సామాజిక వర్గంలోనే అసంతృప్తిని రేకేత్తించాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వచ్చినా ప్రజలు తరిమి కొట్టాలని మంత్రి మల్లారెడ్డి కోరారు.

- Advertisement -