తెలంగాణ ఆర్టీసీకి త్వరలో హైపవర్ కమిటీ నివేదికతో జవజీవాలు కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బస్ భవన్లో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో చైర్మెన్ సోమారపు సత్యనారాయణ, ఇంచార్జీ ఎండీ, రవాణా శాఖ ప్రిన్స్ పుల్ సెక్రటరీ సునీల్ శర్మ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ భేటీ అయ్యింది. కన్వీనర్, ఈడీ పురుషోత్తమ్ నాయక్, కమిటీ సభ్యులు నాగరాజు యాదవ్, హనుమంతరావు, ఆనందరావు, ఆంటోనీ కుమార్, గీతం తివారి, ప్రతీక్ దావే, శ్రీనివాసాచారి , వేణు, గుర్తింపు సంఘం కార్యదర్శి అశ్వద్ధామారెడ్డి, గౌరవ అధ్యక్షుడు ధామస్ రెడ్డి తదితరులు మంత్రితో ముఖాముఖిగా పలు అంశాల మీద చర్చించారు.
అనంతరం మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణాలో ప్రజా రవాణా మరింత బలో పేతం చేయటమే గాకుండా నష్టాల ఊబీలో ఉన్న సంస్థను గట్టెక్కించేందకు సీఎం కేసీఆర్ గతంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం అనుభవాజ్ఞులు, నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని కమిటీ సంస్థల మీద సమగ్రంగా అధ్యయనం చేస్తుందన్నారు. ఇలా టీఎస్ ఆర్టీసీ దేశంలోనే అన్ని ప్రజా రవాణా వ్యవస్థల కంటే మరింత మెరుగైన పనితీరుకు సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. సంస్థలో సమూలమైన మార్పుల కోసం అధ్యయనం చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఆర్టీసీ ఇస్తున్న రాయితీల మీద, ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న రాయితీల అధ్యయనం చేసి నివేదిస్తామన్నారు.
అంతేగాకుండా సంస్థ అంతర్గ పనితీరు మెరుగు పరచుకునేందుకు వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటం కోసం సూచనలు ఇస్తారన్నారు. అలాగే ఆర్టీసీలో రోజు రోజుకు పెరుగుతూ సంస్థకు భారంగా మారుతున్న ఖర్చును తగ్గించు కోవటంతో పాటు సంస్థ నిర్వహాణ, ఇతర అంశాల మీద ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవటం లాంటివి కమిటీ అధ్యయనం చేస్తుందని మంత్రి వివరించారు. ఇలా తెలంగాణ ఆర్టీసీని ముందుకు తీసుకెళడానికి అనేక సంస్కరణలు చేసి ఈ కమిటీ సూచనలు తీసుకుని నడిపిస్తామని చెప్పారు. కమిటీ వారం రోజుల్లో మరోసారి సమావేశం అవుదుతుందన్నారు.
ఆర్టీసీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థలన్ని దాదాపు నష్టాలతో ఉన్నాయని టీఎస్ ఆర్టీసీది అదే పరిస్ధితిగా ఉన్నందున సీఎం కేసీఆర్ సంస్థను గట్టెక్కించేందుకు కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ.. అందరం కలిసి ఆర్టీసీని బలోపేతం చేయాలన్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రో, ఆటోలతో ఆర్టీసీని అనుసంధానం చేయాలన్న యోచన సంస్థ యాజమాన్యానికి ఉందని తెలిపారు.
ఇందుకు సింగిల్ టికెట్ విధానంకు యత్నిస్తున్నామన్నారు. అశ్వథామారెడ్డి మాట్లాడుతూ.. తాము ఆర్టీసీ అభ్యున్నతికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు నివేదించామని అందుకు స్పంధించి సదరు కమిటీని వేశారని మంత్రి మహేందర్ రెడ్డి తదితరుల చొరవతో కమిటి అశాజనీనమైన నివేదిక ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఆర్టీసీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తమ కార్మికులు సంస్థను కాపాడుకున్నారన్నారు.ఈ భేటీలో ఈడీలు, అధికారులు పాల్గొన్నారు.