కొత్తగా ఏర్పాడిన భద్రాద్రి కొత్తగూడెంలో కొత్తగా ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. ఇవాళ ఆయన జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమన్నారు. కొత్తగూడెంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే కొత్త జిల్లాగా ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నూతన జిల్లాగా కొత్తగూడెం పారిశ్రామికంగా మరింత పురోగతి సాధించాలని..అభివృద్దిలో కొత్త పుంతలు తొక్కాలని ఆశించారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనే కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో ఉన్నారని తెలియజేశారు.
కొత్తగూడెం జిల్లాలో 800మెగావాట్ల కేటీపీసీ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నామన్నారు. అందులో స్థానికులకే ఎక్కువ శాతం దక్కేలా చూస్తామన్నారు. అలాగే యువతకు నైపుణ్యాభివృద్ది పెంచేలా టాస్క్ ఫోర్స్ ద్వారా శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు.
సీతారామా ప్రాజెక్ట్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు త్వరలోనే గోదావరి జలాలను తీసుకువస్తామన్నారు. సాగునీటితో రాష్ట్ర్రాన్ని సస్యశామలంగా తీర్చిదిద్దడమే కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. కోటీఎకరాలకు సాగునీరు..ఇంటింటికి తారునీరు అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కోన్నారు. ఇక్కడకు వచ్చేకంటే ముందే మహిళలకు రూ.150 కోట్లు మంజూరు చేశామన్నారు. ఆసరా పథకం ద్వారా 36లక్షల మంది లబ్ధి పొందుతున్నారని..కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా పేదింటి యువతుల పెళ్లికి ఆర్దిక సహాయాన్నిఅందిస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం కష్టపడుతుందన్నారు. మేం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో లోటుపాట్లు ఉంటే మీకు డైరెక్టుగా వచ్చి చెబుతామని, ప్రతిపక్షాలకు చెప్పాల్సిన అవసరంలేదన్నారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదని,,ఇప్పుడేమో పాదయాత్రలు అంటూ కపటప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా వారి డ్రామాలు చూస్తున్నారని విమర్శించారు.
నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అన్ని సమస్యలను పరిష్కరించుకుంటు ముందుకు వెళ్తోందన్నారు. 65 ఏళ్ల పాలన ఏమి చేయని ప్రభుత్వాలు ఇప్పుడు 2ఏళ్లలోనే కేసీఆర్ అన్ని చేయాలనడం సిగ్గుచేటని ఎద్దేవ చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో,,పాల్వంచ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు కర్రు కాచి వాత పెట్టినా..ఇంకా వారికి బుద్ధి రాలేదని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ లపై మంత్రి తుమ్మల ఫైర్ అయ్యారు. రైతు యాత్రల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల్ని ఆగం చేసిన టీడీపీ పాదయాత్రలు చేయడం సిగ్గుచేటన్నారు.