తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన రైతు దీక్షలో మంత్రి కేటీఆర్ పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ పార్టీకి చెందిన గల్లీ నాయకులు ఒక మాట, ఢిల్లీ నాయకులు ఒక మాట మాట్లాడి రైతుల్లో అయోమయాన్ని సృష్టించారు. ధాన్యం సేకరణ విషయంలో ఎవరిది తెలివి తక్కువతనం.. మీ కేంద్రానిదా? తెలంగాణ రైతులదా? అని కేటీఆర్ నిలదీశారు. బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టడం ఖాయమన్నారు. నూకలు తినమని చెప్పిన పార్టీకి తోకలు కత్తిరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు. ఎండకాలంలో మనం పండించే వరి పంటను కొనాలని అడిగితే.. కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. మీ బియ్యం తినమని పీయూష్ గోయల్ అంటున్నాడు. యాసంగిలో వరి సాగు చేయమని రైతులను బండి సంజయ్ రెచ్చగొట్టాడు.. కేంద్రాన్ని ఒప్పించి ప్రతి గింజను కొంటామని చెప్పిండు. కానీ ఇప్పుడేమో ముఖం చాటేశాడు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కూడా అబద్ధాలు చెప్పాడు. రా రైస్, బాయిల్డ్ రైస్‌ను కేంద్రతో కొనిపిస్తామని కిషన్ రెడ్డి చెప్పాడు.. ఆయన కూడా పత్తా లేడని కేటీఆర్ దుయ్యబట్టారు.