దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ఆశించిన గమ్యానికి విజయవంతంగా చేరుకున్నది. ప్రజలిచ్చిన ఆదేశం ప్రకారం తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను తలకెత్తుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసమైపోయిన తెలంగాణను తిరిగి నిలబెట్టి, అభివృద్ధిలో, సంక్షేమంలో అగ్రస్థానానికి చేర్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వ ఎనిమిదేళ్ల కృషి ఫలితంగా నేడు తెలంగాణ దేశంలోకెల్లా ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఖ్యాతి పొందిందన్నారు.
రాష్ట్రం ఏర్పడిననాడు తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కన్నా 43 శాతం ఎక్కువ ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల నేడది 86 శాతం ఎక్కువగా ఉంది. గత ఏడేండ్లలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 1,24, 104 నుంచి 2,78,833 కి పెరిగింది. అదే సమయంలో భారతదేశ తలసరి ఆదాయం 83,647 నుంచి 1,49,948 కి మాత్రమే పెరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంకన్నా తెలంగాణ ప్రభుత్వం ఎంతో మిన్నగా అభివృద్ధిని సాధిస్తున్నదనడానికి ఇది తిరుగులేని సాక్ష్యం.కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథం లో నడిపించలేక తన అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మతాల మధ్య మంటలు రేపుతున్నది. ఈ పరిస్థితిని దీటుగా ఎదుర్కోని ప్రజలకు నిజమైన అభివృద్ధి గురించిన చైతన్యాన్ని కల్పించి ప్రత్యామ్నాయ ఎజెండాను ముందుకు తీసుకురావడంలో దేశం లోని రాజకీయ పక్షాలు విఫలం అవుతున్నాయి. ఫలితంగా దేశం విపత్కర పరిస్థితిలో చిక్కుకొని విలవిలలాడుతున్నది. ఇటువంటి సందర్భంలో జాతీయ, రాజకీయాల్లో దార్శనికత కలిగిన నాయకత్వం, సమర్థత కలిగిన పార్టీ అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ రాజకీయ శూన్యతను పూరించడానికి టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాల్సిన చారిత్రిక అవసరం ముందుకొచ్చిందని టీఆర్ఎస్ విస్తృత సభ భావిస్తున్నది.దేశంలో అవినీతిని అంతమొందిస్తామని, అక్రమార్జనాపరులు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కు తెచ్చి ప్రజలందరికీ పంచుతామని, అచ్చేదిన్ తీసుకొస్తామని మాయమాటలు చెప్పి కేంద్రంలో గద్దెనెక్కిన భారతీయ జనతా పార్టీ దేశాన్ని అధోగతి పాలు చేసింది. ఆర్థిక వృద్ధి క్షీణించిపోయి, అభివృద్ధి అడుగంటిపోయేలా చేసిన నరేంద్ర మోడీ సర్కారు అన్ని రంగాలలో తీవ్రంగా వైఫల్యం చెందింది. అందరికీ వికాసం ఉత్తమాటై పోగా విద్వేషం పునాదుల మీద వినాశం జరుగుతున్నది. సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరంగా, ఏ ప్రమాణాలరీత్యా చూసినా కేంద్ర సర్కారు పనితీరు అత్యంత అధ్వాన్నంగా ఉన్నట్టు వివిధ నివేదికలు కుండ బద్దలుకొట్టినట్టు స్పష్టం చేస్తున్నాయన్నారు.
యుపిఏ ప్రభుత్వ హయాంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదల రేటు 8శాతం ఉంటే, ఎనిమిదేళ్ళ బీజేపీ ప్రభుత్వం అసమర్థ విధానాల ఫలితంగా జిడిపి పెరుగుదల రేటు 8 శాతానికి పడిపోయింది. ఇప్పటికే ఐదు లక్షల పైచిలుకు పరిశ్రమలూ, సంస్థలు మూతపడ్డాయి. బిజెపి అధికారంలోకి రాకముందు నిరుద్యోగం రేటు 4.7 ఉంటే, ఇప్పుడది ‘7.11 కి పెరిగింది. U.N. D.P, ప్రపంచ బ్యాంకు, రిజర్వు బ్యాంకు తదితర సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం నేడు భారతదేశం అనేక రంగాల్లో అథమస్థాయికి దిగజారిపోయింది. ప్రపంచహంగర్ ఇండెక్స్ లో మనదేశం 68వ స్థానం నుంచి 101వ స్థానానికి దిగజారింది. నేపాల్, బంగ్లాదేశ్ దేశాలకన్నా భారత్ హీనస్థితిలో ఉందని, ఆకలి రాజ్యంగా మారిపోయిందని హంగర్ ఇండెక్స్ సూచిస్తున్నది. మానవ అభివృద్ధి సూచీని పరిశీలిస్తే భారతదేశం గతంలో ఉన్న 80వ స్థానం నుంచి 131వ స్థానానికి పతనమైంది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో సైతం 58వ స్థానం నుంచి 98వ స్థానానికి పతనమైంది. ఐక్యరాజ్య సమితి 148 దేశాల్లో అధ్యయనం జరిపి రూపొందించిన హాపీనెస్ ఇండెక్సులో భారతదేశం స్థానం 188. దీన్నిబట్టి ప్రజల జీవితాల్లో సంతోషం ఆవిరైపోయి, తీవ్ర ఆవేదన ఆవరించిందని స్పష్టమవుతుంది. మహిళా రక్షణ సూచీలో గతంలో 198వ స్థానంలో ఉన్న మనదేశం నేడు 148వ స్థానానికి పడిపోయింది. మహిళల మీద అఘాయిత్యాలు, హింసాత్మక దాడులు నిత్యకృత్యమైన ఆటవిక రాజ్యంగా దేశాన్ని మార్చేశారన్నారు.
ఒకవైపు దేశ పరిస్థితి ఘోరంగా పతనమై పోతుంటే, దాన్ని చక్కదిద్దాలనే తపన ఇసుమంతైనా లేకుండా, రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఓటు రాజకీయాల కోసం ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి స్థాయికి చెందిన బిజెపి నాయకులు ఎన్నికల ప్రచారం లో 80 శాతం వర్సెస్ 20శాతం” అంటూ విషపూరిత వ్యాఖ్యలకు పాల్పడుతున్నారు. ప్రజల్ని నిట్టనిలువునా విభజిస్తున్నారు. మతకల్లోలాల మంటల్లో చలి కాచుకుంటున్నారు.దేశం కోసం ధర్మం కోసం అనే ముసుగులో జాతి సంపదను అడికి పావుసేరు చొప్పున అమ్మేస్తున్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచిన హెచ్.పీ.సీ.ఎల్, కోల్ ఇండియా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీపీసీఎల్, ఐడీబీఐ బ్యాంకు మొదలైన సంస్థల ఉసురు తీసిన పాపం కేంద్రప్రభుత్వానిదే. మోడీ ప్రభుత్వ హయాంలో అమ్మిన ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల మొత్తం విలువ దాదాపు మూడున్నర లక్షల కోట్లు. కాగా, మరిన్ని సంస్థల అమ్మకం యథేచ్ఛగా కొనసాగుతున్నది. దేశాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తూన్న, విశ్వాసానికి మారుపేరుగా నిలిచి దేశ ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఎసీని సైతం నిస్సిగ్గుగా అమ్మకానికి పెట్టిన నీచ, నికృష్ట ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. డెబ్బై ఏండ్ల చరిత్ర క్రమంలో జాతి సముపార్జించిన విలువైన ఆస్తులన్నీ ఒకరిద్దరు బడా పెట్టుబడిదారుల పరమైపోతున్నాయన్నారు.
పేద ప్రజల చేత జన్ ధన్ ఖాతాలు తెరిపించి, ఒక్క పైసా విదిల్చని బీజేపీ ప్రభుత్వం పెద్ద గద్దలకు మాత్రం ప్రజా ధనాన్ని పెద్దఎత్తున దోచిపెడుతోంది. బడా పెట్టుబడిదారులు కట్టకుండా ఎగవేసిన 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు మాఫీ చేసింది. పెట్టుబడిదారుల ముసుగులో బ్యాంకులను లూఠీ చేసిన బడా బందిపోటు దొంగలు విదేశాల్లో తలదాచుకోవడానికి బీజేపీ ప్రభుత్వం తనవంతు సహకారాన్ని చక్కగా అందిస్తోంది. ఏదైనా రాత్రికి రాత్రే ప్రకటించి, ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అలవాటు. అది నోట్ల రద్దు అయినా, లాక్ డౌన్ అయినా. ముందస్తు జాగ్రత్తలు లేకుండా ప్రకటించడం, జనాన్ని సమస్యల వలయంలోకి నెట్టడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కరోనా మహమ్మారి దేశంలో వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైన బీజేపీ ప్రభుత్వం వేలాదిమంది ప్రాణాలు కోల్పోయేలా చేసిందన్నారు.
రాత్రికి రాత్రే లాక్ డౌన్ ప్రకటించి వలస కార్మికులను రోడ్డున పడేసింది. దిక్కుతోచని పరిస్థితుల్లో వలస కార్మికులు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వస్థలాలకు చేరడం కోసం కాలినడకన బయలుదేరి చెప్పనలవిగాని కష్టాన్ని, దు:ఖాన్ని అనుభవించారు. అనేకమంది కార్మికులు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. దేశ చరిత్రలోనే మానవ తప్పిదం వల్ల జరిగిన మహా విషాదంగా వలస కార్మికుల యాత్ర సంఘటన నిలిచిపోయింది. జరిగిన ఘోర విషాదానికి,జాతికి క్షమాపణలు చెప్పవలసింది పోయి, వలస కార్మికుల వల్లనే కరోనా వ్యాపించిందని ప్రధాని మోడీ అమానవీయంగా నిందిస్తే, ప్రజలు అసహ్యించుకున్నారు.
కరోనా రెండవ వేవ్ సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థత వల్ల దేశం శవాల దిబ్బగా మారింది. పవిత్ర గంగా నది వేలాది శవాల ప్రవాహంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దారుణ వైఫల్యాలను విమర్శిస్తే దేశద్రోహులుగా, హిందూ మత వ్యతిరేకులుగా, అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వానిది అంతులేని వైఫల్యాల చరిత్రయితే, తెలంగాణ ప్రభుత్వానిది అద్భుత సాఫల్యాల చరిత్ర. అభివృద్ధి, సంక్షేమ ప్రమాణాల్లో మన రాష్ట్రం అసాధారణ పురోగతిని సాధించింది. అవినీతి రహిత పారదర్శక పరిపాలన అందిస్తూ, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను, వివేకాన్ని, విచక్షణను (FISCAL PRUDENCE) పాటిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపింది. TODAY TELANGANA IS A TORCH BEARER. నేడు తెలంగాణ ఆచరించింది, రేపు అన్ని రాష్ట్రాలూ అనుసరిస్తాయి అన్నమాట అక్షర సత్యం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి తదితర పథకాలు యావత్ దేశానికి ఆదర్శప్రాయమయ్యాయి. వ్యవసాయ అనుంబంధ రంగాల్లో సాధించిన అద్భుత ప్రగతితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. ‘పల్లెప్రగతి’తో గ్రామాలు, ‘పట్టణ ప్రగతి’తో పట్టణాలు అందంగా ఆదర్శవంతంగా రూపుదిద్దుకున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఎల్లెడలా సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పింది. సర్వమత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని సామాజికవర్గాల విశ్వాసాన్ని చూరగొనడం వల్ల, మెరుగైన శాంతిభద్రతల పరిరక్షణ వల్ల, సుస్థిర పరిపాలన వల్ల ప్రజా జీవితంలో ప్రశాంతత నెలకొన్నది.జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు తెలంగాణకు వెల్లువెత్తుతున్నాయి. “సంపద పెంచు-ప్రజలకు పంచు” అని నినదించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి దార్శనిక సారథ్యంలో నేడు తెలంగాణ ‘ఫాస్టెస్ట్ వెల్త్ క్రియేటర్’ గా పేరుగాంచింది. అనేక ప్రమాణాల్లో అగ్రస్థానంలో నిలిచింది.2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీ.ఎస్.డి.పి 4, 51,580 కోట్ల రూపాయలు. ఇది 2021-22 నాటికి 11,54,880 కోట్ల రూపాయలకు పెరిగింది. 2015 – 18 నుండి రాష్ట్ర జీఎన్డీపీ వృద్ధి రేటు జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందినట్లుగానే దేశం కూడా అభివృద్ధి చెంది ఉన్నట్లయితే మన రాష్ట్ర జీఎస్టీపీ మరింత పెరిగి 14.8 లక్షల కోట్లకు చేరుకునేది.కానీ కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్ల రాష్ట్ర జీఎస్టీపీలో దాదాపు 3 లక్షల కోట్లు తెలంగాణ నష్టపోయింది. కరోనా విపత్తు నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు మైనస్ 1.4 శాతంగా నమోదయింది. అనేక రాష్ట్రాలు నెగిటివ్ గ్రోత్ లోకి వెళ్లిపోయాయి. తెలంగాణ మాత్రం 2.2 శాతం పాజిటివ్ వృద్ధిరేటు సాధించింది. దేశంలోని రాష్ట్రాలకు సంబంధించి అప్పుల విషయంలో మనది చివరి నుంచి 8వ ర్యాంకు. తెలంగాణ అప్పులు ఎస్ఆర్ బిఎం పరిమితులకు లోబడే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న వ్యయంలో ప్రధాన భాగం పెట్టుబడి వ్యయమే. ఇది మన ప్రగతిశీలతకు నిదర్శనం. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి నిర్మాణాత్మక కార్యక్రమాల కోసం మనం వెచ్చించిన ప్రతీ రూపాయీ సార్థకమైందన్నారు.
దేశం విషయానికొస్తే యూపీఏ హయాంలో అప్పులు 74 లక్షల కోట్లు ఉండేవి. ఈ రోజు భారతీయ జనతాపార్టీ హయాంలో భారతదేశం అప్పులు 152 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది దేశ జీడీపీలో 58.5 శాతం. రాష్ట్రాలకు 25 శాతం ఎస్ఆర్.బిఎం విధించే కేంద్రం, తన విషయానికి వచ్చే సరికి ఏ పరిమితీ పాటించకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. పోనీ తెచ్చిన అప్పులతో దేశాన్ని ఉద్దరించిందేమైనా ఉందా అంటే అదీ లేదు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్సులో మన రాష్ట్రం కేరళ, తమిళనాడు తర్వాత మూడో స్థానంలో ఉండగా, డబుల్ ఇంజన్ గ్రోత్ అని డంభాలు పలుకుతున్న బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అథమస్థానంలో ఉంది. 2014 లో మాతా మరణాలు ప్రతి లక్ష ప్రసవాలకు 92 ఉండేవి. ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన మెరుగైన పనితీరు వల్ల 58 కి తగ్గిపోయాయి. అదే బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో మాతా మరణాల సంఖ్య అత్యధికంగా 187 కావడం గమనార్హం. తెలంగాణలో శిశు మరణాల రేటు అతి తక్కువగా 22 మాత్రమే ఉంటే, ఉత్తర ప్రదేశ్ లో 41 గా నమోదవుతున్నాయి. ఎవరి పరిపాలన ఏవిధంగా ఉందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఆత్మ నిర్బర భారత్’ అంటూ ఊదరగొట్టడమె తప్ప ప్రజల జీవన ప్రమాణాల్లో ఏ కొంచెం మెరుగుదల సాధించలేదు ఆత్మ నిర్బర భారత్ కాదుగానీ, బతుకు దుర్భర భారత్ గా మాత్రం దేశాన్ని మార్చింది.ఇకనైనా ఈ పరిస్థితి మారాలి. దేశానికి పట్టిన ఈ దుర్గశను వదిలించాలి. దేశ ప్రజల బతుకులను దుర్బరం చేస్తూ విభజించి పాలించే దుర్నీతికి పాల్పడుతున్న, ప్రజల బతుకుల మీదికి బుల్డోజర్లు నడిపిస్తున్న దుష్ట పరిపాలనను అంతమొందించేందుకు టీఆర్ఎస్ నడుం బిగించాలి. తెలంగాణను ఏ విధంగానైతే ఆర్థికంగా, సామాజికంగా, వ్యవసాయికంగా, విద్యా, వైద్య విషయికంగా అత్యున్నత స్థాయికి తీసుకురాగలిగిందో, అదే విధంగా దేశంలోనూ గుణాత్మక మార్పును సాధించే దిశగా జాతీయ రాజకీయాల్లో కీలక భూమికను పోషించేందుకు టీఆర్ఎస్ పార్టీ సమాయత్తం కావాలని నేటి విస్తృత సభ తీర్మానిస్తుందన్నారు.