గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గోషామహల్ నియోజకవర్గంలోని జుమ్మెరాత్ బజార్ లో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. గోషామహల్ కార్పొరేటర్ అభ్యర్థి ముఖేష్ సింగ్, మంగల్‌హాట్ నుంచి పరమేశ్వరి సింగ్, బేగంబజార్ నుంచి పూజా వ్యాస్ బిలాల్, జాంబాగ్ నుంచి ఆనంద్ గౌడ్, గన్‌ఫౌండ్రీ నుంచి మమతా సంతోష్ గుప్తా లను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంటు బాగుంది.. మంచినీళ్ల సౌలత్ ఉంది, టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నరు, అన్నింటికి మించి కేసీఆర్ వంటి దమ్మున్న నాయకులు ఉన్నరని ఇన్వెస్టర్లు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో జనరేటర్లు, ఇన్వర్టర్లు మాయమై ఇన్వెస్టర్లు వస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నట్లు తెలిపారు. నగరంలో నేడు చైన్ స్నాచింగ్ లేవు, దొమ్మీలు లేవు, ఆంధ్రా-తెలంగాణ పంచాయతీలు లేవు.. ఆరేళ్లుగా శాంతి ఉంది. ఇది అందరి హైదరాబాద్. కానీ కొంతమంది నేడు ఇది అందరి హైదరాబాద్ కాదు అంటున్నరు. అటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు మంత్రి.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్, రూ. 5 కే అన్నపూర్ణ భోజనం, బస్తీదవాఖానాలు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. 24 గంటల విద్యుత్‌తో పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉన్నారు. కార్మికులకు పనిదొరుకుతుందన్నారు. ఢిల్లీ నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ప్రచారానికి వచ్చేవాళ్లు ఇవాళ ఉంటరు రేపు పోతరు. కానీ మనమంతా ఇక్కడే ఉండాలన్నారు. కరోనాలో సమయంలో ప్రజల వెంట ఉన్నది తామే, వరదల కష్టంలో వచ్చింది తామేనన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో కూడా బీజేపీని గెలిపించాలని.. అప్పుడే డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధ్యమౌతుందని ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. మరి ప్రధాని మోదీ మాదిరే తాము చెబుతున్నామని రాష్ట్రంలో ఇప్పటికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. డబుల్ ఇంజిన్ గ్రోత్ కావాలంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని మంత్రి కేటీఆర్ నగరవాసులను విజ్క్షప్తి చేశారు. అందరినీ సమానంగా చూస్తూ అభివృద్ధిలో నడిపిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉంటూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 స్థానాలకుపైగా గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు.