ప్రపంచ యవనికపై తెలంగాణ కీర్తి పతాకం సగర్వంగా ఎగిరింది! ఫ్రెంచ్ సెనేట్ లో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసానికి స్థానిక వాణిజ్య, రాజకీయ ప్రముఖుల నుండి విశేష స్పందన వచ్చింది. కేటీఆర్ ప్రసంగానికి సభికులు కరతాళధ్వనులతో స్పందించారు. పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగిన ‘యాంబిషన్ ఇండియా 2021’ బిజినెస్ ఫోరమ్‌లో మంత్రి కేటీఆర్ చేసిన కీలకోపన్యాసం ప్రపంచవ్యాప్తంగా వివిధ నాయకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ప్రతిష్టాత్మక కాన్ఫరెన్స్ లో “కోవిడ్ అనంతర కాలంలో ఇండో-ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తును రూపొందించడం” అనే అంశం మీద మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును వివరిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు మంత్రి కేటీఆర్.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. “జాతీయ విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధి అయితే, భారత సమాఖ్య నిర్మాణంలో, రాష్ట్రాలు కూడా భూమి కేటాయింపు, ఆమోదం మరియు అనుమతులు అందించడం, శిక్షణ పొందిన మానవ వనరులను పొందడంలో కంపెనీలకు సహాయం చేయడం, వనరుల సేకరణ విధానాలు వంటి బహుళ కార్యాచరణ అంశాలలో గణనీయమైన స్వయం ప్రతిపత్తిని పెంపొందించుకుంటున్నాయని మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని మంత్రి కేటీఆర్ వివరించారు.తెలంగాణ ప్రభుత్వ పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, రాష్ట్రంలో నెలకొన్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను మంత్రి కేటీఆర్ సెనేట్ వేదికగా ప్రస్తావించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని ఫ్రెంచ్ పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు. ఫోరమ్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఫ్రెంచ్ కంపెనీలకు, ముఖ్యంగా ఎస్‌ఎంఈలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేయడానికి సుముఖంగా ఉందన్నారు.
టీఎస్ ఐపాస్ గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ అత్యంత ప్రగతిశీల రాష్ట్రమని, తెలంగాణ ప్రభుత్వ టీఎస్ ఐపాస్ పాలసీ పారదర్శకతతో కూడిన స్వీయ-ధృవీకరణను అనుమతిస్తుందని మరియు చట్టం ప్రకారం 15 రోజులలో అన్ని రకాల అనుమతులకు సంబంధించి పూర్తి క్లియరెన్స్ లభిస్తుందన్నారు. ఈ 15 రోజుల వ్యవధిలో అనుమతుల జారీ జరగకపోతే 16వ రోజున, పూర్తి అనుమతులు లభించి ఆమోదించబడినట్లు భావించబడుతుందన్నారు. తెలంగాణకు TSIICలో దాదాపు 200 వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందనీ, విద్యుత్, నీరు మరియు ఉత్తమ మౌలిక సౌకర్యాలను కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు.
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను మంత్రి కేటీఆర్ హైలైట్ చేస్తూ, ప్రభుత్వం తన సొంత ఖర్చులతో శిక్షణనిస్తుందని, వారిని నాణ్యమైన మానవ వనరులుగా మారుస్తుందని, ఇది స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏ కంపెనీ అయినా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ఇతర రాష్ట్రాలు ఆఫర్ చేస్తున్న అంశాలను ప్రస్తావించగలిగితే, మేము వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా ఆఫర్‌ను అందుకుంటామని లేదా వారి ఆఫర్‌ను బీట్ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి తెలంగాణను భాగస్వామ్య రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కేటీఆర్.