ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఎలక్ట్రానిక్ రంగంలో తెలంగాణను విశ్వవ్యాప్తం చేస్తామని చెప్పారు. 912 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ క్లష్టర్లు ఉన్నాయని తెలిపారు.
ఎలక్ట్రానిక్ ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎలక్ట్రానిక్ కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తోందని తెలిపారు. రూ. 70 వేల కోట్ల పెట్టుబడులతో 4 లక్షల ఉద్యోగాల కల్పనను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.తెలంగాణ ఏర్పడక ముందు ఈ రంగంలో 50 వేల ఉద్యోగాలు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదనంగా లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించుకున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.