తెలంగాణ ఏర్పాటుపైన పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపైన మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏండ్ల తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమాలను తక్కువ చేసి మాట్లాడేలా ప్రధానమంత్రి పదేపదే తన అక్కస్సును వెళ్లగక్కుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపైన ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా తన గుడ్డి వ్యతిరేకతను వెల్లగక్కడం ఇప్పటికే అనేకసార్లు చూసామన్నారు. తెలంగాణ సమాజమంతా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ త్యాగాల పునాదుల పైన ఏర్పడిందని, అలాంటి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంబురాలు జరగలేదన్న నరేంద్ర మోడీ, చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న చారిత్రక అంశాల పట్ల ప్రధానమంత్రి సున్నితంగా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంబరాలు జరగలేదు అనడం ప్రధానమంత్రి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ఉద్దేశంతో ప్రధానమంత్రి పదేపదే కోట్లాదిమంది తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేవలం స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మనోభావాలతో అడుకోవడం మానుకోవాలని, చారిత్రక అంశాల పట్ల సున్నితంగా వ్యవహరిస్తూ, అర్థం చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ప్రధానమంత్రి ఇలాంటి హోదాల్లో ఉన్న వ్యక్తులకు అత్యంత అవసరమని సూచించారు.
తెలంగాణపై మోడీ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ గారు, మోడీ ద్రోహాలను గుర్తు చేశారు. పార్లమెంట్ అమృతకాల సమావేశాలని పేరుపెట్టి తెలంగాణపై విషం చిమ్మడం ఏ సంస్కారానికి గుర్తని ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు.. పగబట్టినట్టు రాష్ర్ట పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా అన్నారు. మా దశాబ్దాల కల నెరవేరిన నాడు… అంబరాన్ని అంటిన తెలంగాణ సంబరాలు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఉత్సవాలు కనిపించలేదా ? అని ప్రశ్నించారు. గాంధేయ మార్గంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరిగిందనడం ఆత్మగౌరవ పోరాటాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానించడమే అన్నారు. గతంలో తల్లిని చంపి బిడ్డను తీసారని అజ్ఞానం.. అహంకారంతో ఇంకెన్నిసార్లు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తారన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారని ప్రశ్నించారు. వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని మా రైతుల్ని కించపర్చిండు.. మీ కేంద్రమంత్రి, ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా..మీలాగే మీ మంత్రులు తెలంగాణ పట్ల తీవ్ర వ్యతిరేఖత నింపుకున్నారన్నారు. నిధుల మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వని ప్రధాని, కనీసం.. మాటల్లోనైనా మర్యాద చూపించాలని సూచించారు.
కోటి ఆశలు.. ఆకాంక్షలతో పురుడుపోసుకొన్న కొత్త రాష్ట్రానికి సహకరించక పోగా..ఆది నుంచి కక్షను పెంచుకొని.. ప్రధాని వివక్షనే చూపిస్తున్నారన్నారు. ఏడు మండలాలు గుంజుకొని.. లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని తెలంగాణ మర్చిపొదన్నారు. నీతి ఆయోగ్ చెప్పినా నీతి లేకుండా మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథలకు నిధులను నిరాకరించిన కేంద్రం వైఖరి తెలంగాణ ప్రజలకు గుర్తుండిపొతుందన్నారు. కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేండ్లుగా దక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా అర్థం చేసుకోవాలన్నారు. కాజీపేట కోచ్ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని తెలంగాణ క్షమించదన్నారు. 157 మెడికల్ కాలేజీల్లో.. ఒక్కటి ఇవ్వకుండా గుండుసున్నా చేసారంటే..మీకు తెలంగాణపై ఎంత కోపమో తెలుసున్నారు. పైన అప్పర్ భద్ర.. కింద పోలవరం.. ఇంకెక్కడో కెన్‌బెత్వాకు జాతీయ హోదా ఇచ్చి.. మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు చూపారో మీ గుడ్డి వ్యతిరేఖత చూస్తే అర్ధం అవుతుందన్నారు. బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి.. గిరిజన వర్సిటీని పక్కన పెట్టి, సింగరేణి బొగ్గు బావుల్ని వేలం వేసి, ఐటీఐఆర్‌ను రద్దు చేసి, హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ తరలించి అడుగడుగునా తెలంగాణ ప్రగతికి అడ్డంకులు కల్పించారన్నారు. ఒక వైపు నిధులివ్వరు… సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధించిన తీరుని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే పగతో జుమ్లా.. హమ్లాలు చేసే డబుల్ ఇంజన్ సర్కారు మీదన్నారు. ఈడీ.. ఐటీ.. సీబీఐ లాంటి వేట కుక్కలతో ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్న ప్రధాని, ప్రజాస్వామ్యం గురించి సుద్దులు చెప్పడం విచిత్రం అన్నారు. తెలంగాణపై వ్యతిరేకత నింపుకున్న మీరు డబుల్ ఇంజన్ నినాదంతో ఊదరగొట్టినా తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావన్నారు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా అన్నారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన బీజేపీకి, ఇక్కడ పుట్టగతులు ఉండవని తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఆపి, అదే పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని, దేశం అంటే రాష్ట్రాల సమాహారం అని తెలుసుకోవాలన్నారు.
Also Read:మహేష్ సినిమాలో కూడా అదే స్ట్రాటజీ?
I am deeply dismayed by Prime Minister @NarendraModi ji's comments regarding the formation of Telangana state
This is not the first instance where the PM has made disparaging remarks about Telangana formation, and it reflects his utter disregard for historical facts
The people… https://t.co/EeKVRXNxDK
— KTR (@KTRBRS) September 18, 2023