మంత్రి కేటీఆర్ గురువారం కరీంనగర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను ఒక లక్ష్మీనగరంగా సీఎం చూస్తారు. ఇక్కడ ప్రారంభించే ప్రతి పని విజయవంతం అవుతుందని కేసీఆర్ నమ్ముతారు. మే 17, 2001న సింహగర్జన సభ పెట్టి తెలంగాణ సాధనకు నాంది పలికారు. తెలంగాణ వచ్చింది. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలంగాణ రాకముందు రూ. 200 పెన్షన్ ఉండే. ఇప్పుడు ఆసరా పెన్షన్ల కింద రూ. 2016లు ఇస్తున్నాం. ఆసరా పెన్షన్లు పెద్ద మనషుల్లో ఆత్మగౌరవం తీసుకొచ్చింది. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది మాత్రమే. భర్తల చేత నిరాదరణకు గురైన మహిళలకు సైతం పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు రూ. 3,016 ఇస్తున్నాం. కులం, మతంతో సంబంధం లేకుండా 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేసి లక్షా నూట పదహారులు ఇస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు.
కరీంనగర్‌కు 24 గంటల పాటు నీళ్లు..
కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయించాం. వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా ప్రారంభం కాబోతున్నది అని కేటీఆర్ తెలిపారు. రూ. 1067 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. కరీంనగర్‌కు ఒకప్పుడు తాగునీటికి ఇబ్బంది ఉండేది. ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. 50 వేల కనెక్షన్లకు 24 గంటల పాటు నీళ్లు ఇస్తామన్నారు. కరీంనగర్ ఎల్ఎండీ వద్ద అద్భుతమైన తీగల వంతెనను నిర్మించారు. రూ. 410 కోట్లతో సదాశివపల్లి దాకా మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
గెలిచి 3 ఏండ్లు అయింది.. రూ. 3 కోట్ల పని కూడా చేయలేదు..
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి.. ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు టీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యి పనులు చేసింది. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్ సిటీ స్టేటస్ కరీంనగర్‌కు వచ్చింది. గెలిచి మూడేండ్లు అయింది. కనీసం కరీంనగర్ పట్టణం కోసం రూ. 3 కోట్ల పని కూడా చేయలేదు. దమ్ముంటే చెప్పాలి. కరీంనగర్‌కే కాదు.. సిరిసిల్ల నేతన్నలకు పవర్ లూమ్ కస్టర్ ఇవ్వకుండా మొండి చేయి చూపుతున్నారు. చొప్పదండికి కూడా ఏం చేయలేదు. కాళేశ్వరం ద్వారా పూర్వ కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కనీసం జాతీయ హోదా ఇప్పియ్యలేదు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కనీసం పార్లమెంట్‌లో కూడా మాట్లాడలేదని కేటీఆర్ మండిపడ్డారు.
కమలాకర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి..
టీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్‌కు మెడికల్ కాలేజీ కేటాయించిందని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఒక మెడికల్ కాలేజీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ రాలేదు. చివరకు పాలిటెక్నిక్ కాలేజీ కూడా తేలేదు. పొద్దున్నే లేస్తే హిందూ ముస్లిం అంటారు. ఒక గుడి కూడా తేలేదు. ఏం చేతకాదు. కేసీఆర్‌ను తిట్టడం, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కరీంనగర్ ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయలేదు. చేనేత సముహాలు, బ్లాక్ లెవల్ క్లస్టర్ ఇవ్వాలని కోరితే కూడా తెప్పించలేదు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అర పైసా పని కూడా చేయలేదు. బూతులు తిట్టడం తప్ప మంచి చేసిందేమీ లేదన్నారు. పిల్లల భవిష్యత్‌కు పనికొచ్చే పనికి ఒకటి కూడా చేయలేదు. పనికిమాలిన మాటలతో కడుపు నిండదు. మతము అనే పిచ్చి కడుపు నింపదు. భారతదేశానికి బువ్వ పెట్టే మొదటి నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. బీజేపీ నాయకులు మాట్లాడే మాటలు డొల్ల మాటలు. బండి బాగా మాట్లాడుతున్నావ్.. దమ్ముంటే గంగుల మీద పోటీ చేసి గెలువాలని సవాల్ విసురుతున్నా. కమలాకర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.