ఓపెన్ నాలాల క్యాపింగ్ నిర్మాణానికి చర్యలు- కేటీఆర్‌

161
ktr

హైదరాబాద్ లోని ఓపెన్ నాలాల క్యాపింగ్ నిర్మాణానికి (బాక్స్ డ్రైనేజీల నిర్మాణం)  భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు ఈరోజు పేర్కొన్నారు. హైదరాబాదులో రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాల పైన  క్యాపింగ్  కార్యక్రమాలు పూర్తి చేయాలని ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసేందుకు సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని, వీటన్నిటికీ త్వరలోనే పరిపాలనా పరమైన అనుమతులు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సాధారణంగా 2 మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలన్ని కూడా జనసమ్మర్థం ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఇలాంటి భారీ కార్యక్రమాన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు.

రెండు మీటర్ల కన్నా వెడల్పు ఉన్న నాలాల పైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి నాలాలకు గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం క్యాపింగు కుదరని నేపథ్యంలో వాటికి పకడ్బందీగా ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఉందని అలాంటి కార్యక్రమాన్ని సైతం జిహెచ్ఎంసి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిహెచ్ఎంసి వద్ద అన్ని నాలాలకి సంబంధించిన సమాచారం ఉందని వీటితోపాటు నగరం విస్తరించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న నాలాలా సమాచారం సేకరించాలని ఈ సందర్భంగా మంత్రి జోనల్ కమిషనర్లకు, డిప్యూటీ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.