జీహెచ్‌ఎంసీ అధికారులతో కేటీఆర్ రివ్యూ..

139
ktr
- Advertisement -

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పురపాలక శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పురపాలక విభాగాల ఆద్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న రోడ్డు నిర్వహణ మరియు నిర్మాణ కార్యక్రమాలపైన అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం మరియు సిఆర్ఎంపీ కార్యక్రమాల్లో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాల పైన అధికారులు మంత్రికి వివరాలు అందించారు. సిఆర్ఎంపీ కార్యక్రమం ద్వారా నిరంతరం నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కొనసాగిస్తున్నందున, వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్వహణతో పాటు రోడ్డుకు అనుబంధంగా ఉన్న పుట్ పాత్, జంక్షన్ల అభివృద్ధి, నిర్వహణ వంటి అంశాల పైన మరింత దృష్టి సారించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

నగరంలో చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణం సత్ఫలితాలను ఇస్తుందని, మరిన్ని లింక్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైన కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంత్రి జీహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు.

వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి అయ్యాయని, ఈసారి భారీగా వర్షాలు కురిసినా, పలు ప్రాంతాలు గతంలో మాదిరి నీట మునిగిపోకుండా వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం ఎంతగానో సహాయపడిన విషయాన్ని మంత్రి కేటీఆర్ కు అధికారులు వివరించారు. హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫార్ములా-ఈ రేసుకి సంబంధించి మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో సమీక్షించారు. ఫార్ములా-ఈ కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ఫార్ములా-ఈ నిర్వాహకులతో పాటు, పురపాలకశాఖ హెచ్ఎండీఏ అధికారులు సమన్వయంతో ముందుకుపోతున్నారని, ఫార్ములా-ఈ రేసుని విజయవంతంగా పూర్తి చేస్తామన్న విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేశారు.

- Advertisement -