హైదరాబాద్‌లో రాబోయే మూడు,నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి కేటీఆర్. మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులు పాల్గొనగా వరద సహాయక చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సహాయక చర్యలను పరిశీలించేందుకు తక్షణమే 100 మంది సీనియర్ అధికారులను ప్రత్యేక ఆఫీసర్లుగా నియమించాలని మున్సిపల్ శాఖను కేటీఆర్ ఆదేశించారు. 100 మంది ప్రత్యేక ఆఫీసర్లు.. రాబోయే 10 రోజులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. ఇతర శాఖలను సమన్వయం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు శిథిలావస్థ భవనాల్లో ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని సూచించారు. ముంపు ప్రజల ఆశ్రయం కోసం కమ్యూనిటీ, ఫంక్షన్ హాల్స్‌ను సిద్ధం చేయాలని చెప్పారు. నిరాశ్రయుల కోసం అన్నపూర్ణ భోజనం అందించాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి. మొబైల్ టాయిలెట్లు కూడా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.