వరద ముంపు ప్రాంతాల్లో మూడో రోజు విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, విద్యుత్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరా నిలిచిన అపార్ట్‌మెంట్‌లు, కాలనీలకు 24 గంటల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరించుటకు సమన్వయంతో వ్యవహరించాలని జిహెచ్ఎంసి, విద్యుత్ శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల తక్షణ మరమ్మతులకు రూ. 297 కోట్లతో పనులు చేపట్టాలని ఆదేశించారు.
వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని వాటర్ వర్క్స్ అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రూ. 50 కోట్లతో దెబ్బతిన్న సివరేజి, వాటర్ పైప్‌లైన్ల పునరుద్దరణ పనులు చేపట్టాలని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సమీక్షలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండి దానకిషోర్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఇ.వి.డి.ఎం. డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ ఎం.డి రఘుమారెడ్డి, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, సిసిపి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.