అభిమానులకు మంత్రి కేటీఆర్ పిలుపు..

143
- Advertisement -

ఈ నెల 24న తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరు సాధ్యమైనంత మేరకు ఇతరులకు, తమకు తోచిన రీతిగా సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కే తారకరామారావు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు. గత ఏడాది తన సొంత నిధులతో అంబులెన్సులను అందించిన తీరగానే ఈసారి తాను స్వయంగా 100 మోటరైస్డ్ త్రిచక్ర వాహనాలను వికలాంగులకు అందిస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించారు. గత ఏడాది మాదిరే ఈసారి కూడా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో పాల్గొంటూ కేటీఆర్ జన్మదిన సందర్భంగా తాము సైతం భాగస్వాములను అవుతామని పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీ నాయకులు, అభిమానులు ఈ రోజు ప్రకటించారు.

గత ఏడాది తాను 6 అంబులెన్సులను ప్రభుత్వానికి అందించానని, అదేమాదిరి పార్టీ నాయకులు శ్రేణులు మరో 100 అంబులెన్సులను తమ వ్యక్తిగత నిధులతో అందించారని, ఈ అంబులెన్స్ లు కరోనా సంక్షోభంలో ఉపయుక్తంగా నిలిచయన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా తమకు తోచిన విధంగా ఇతరులకు సహాయం చేయడంతో పాటు ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో భాగంగా కనీసం ఒక మొక్కను నాటాలని మంత్రి కేటీఆర్ కోరారు. బొకేలు, కేకులు ,హోర్డింగులు ప్రకటనల పైన ఖర్చు చేయకుండా సేవా కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి. ఎమ్మెల్సీ నవీన్ రావు 100, ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చెరో 60, మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చెరో 50, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, గాదరి కిషోర్ 20, త్రిచక్ర వాహనాలను కేటీఆర్ జన్మదినం సందర్భంగా అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, శానంపూడి సైదిరెడ్డి, జీవన్ రెడ్డి పలువురు తమ వ్యక్తిగత స్థాయిలో త్రిచక్ర వాహనాలను అందిస్తామని తెలిపారు.

- Advertisement -