కేంద్రమంత్రులకు కేటీఆర్ ప్రశ్నల వర్షం!

61
minister
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రులను ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కైతలాపూర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన‌ సభలో మాట్లాడారు. 2014లో జన్‌ధన్‌ ఖాతాలు తెరువాలని రూ.15లక్షలు వేస్తానని ప్రధాని మోదీ చెప్పాడని.. ఒక్కరికైనా రూ.15లక్షల వచ్చాయా? బహిరంగ సభ వేదికగా ప్రశ్నించారు. నేను చెప్పేది అబద్ధం కాదు.. కావాలంటే గూగుల్‌ వెతకండి.. మీకే తెలుస్తుంది. నేను చెప్పేది కథ కాదు.. నిజమే.. గూగుల్‌లో కొట్టండి.. గూగుల్‌ తల్లే చెబుతుందన్నారు.

రాబోయే వారం రోజుల్లో దేశంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు.. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు వస్తున్నరట.. వారందరినీ కూకట్‌పల్లి వేదికగా అడుగుతున్న.. ప్రధానమంత్రి గారు గుజరాత్‌ రూ.20వేలకోట్లతో ప్రాజెక్టులకు శంకుస్థాపన అంటరు. ఇంకోకాడికి ఆడో వేలకోట్లతో కార్యక్రమని ప్రకటన చేస్తరు.. మరి అది నిజమో, అబద్ధమో తెల్వదు. మీరు ఇప్పటి వరకు చెప్పిన చాలా మాటలు జుమ్లాలు, ఉత్త డొల్ల మాటలు తప్ప మాటలు తప్ప అందులో విషయం ఉండదని విమర్శించారు.

2022 కల్లా భారతదేశంలోని ఇంటింటికీ నల్లాపెట్టి నీరు అందిస్తానని మోదీ అన్నారని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొని.. ఇంటింటికీ నల్లానీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని, దానికి ఒకపైసా కూడా సాయం చేయలేదని ఆరోపించారు. నీతి ఆయోగ్‌ స్వయంగా రూ.19వేలకోట్ల సాయం చేయమని చెప్పినా 19 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. అది మాత్రమే కాకుండా ఎన్ని అడిగినా ఈ ఎనిమిది సంవత్సరాల్లో అర పైసా సహాయం చేయలేదన్నారు.

పెద్ద నోట్ల రద్దని.. రాత్రికి రాత్రి రద్దు చేస్తే సామాన్యులు తాము బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముల కోసం బ్యాంకుల ముందు చాంతాడంత నిలబడి నిలబడి మూర్చ వచ్చి చచ్చిపోతే, చక్కరచ్చి పడిపోతే పట్టించుకోలేదన్నారు.

- Advertisement -