గౌడన్నలకు అండగా ఉంటాం:కేటీఆర్‌

484
- Advertisement -

సమైక్యరాష్ట్రంలో కులవృత్తులను నాశనం చేశారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అందుకే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కులవృత్తులను ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన మంత్రి… గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నదని చెప్పారు. ప్రతి కులవృత్తికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. వైన్‌ షాపుల్లో గీత కార్మికులకు 15 శాతం రిజర్వేషన్‌ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

గౌడన్నలకు చెట్ల పన్నును రద్దు చేశామని, కల్లు డిపోలను తెరిపించి గౌడన్నలకు అండగా నిలిచామని, చెట్ల పన్నును రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పెన్షన్లను రూ.200 నుంచి రూ.2016కు పెంచామని, గీత కార్మికులకు కూడా నెల రూ.2016 పెన్షన్‌ ఇస్తున్నామని, ఆడబిడ్డల పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో లక్ష చొప్పున సాయం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గీత వృత్తిదారులకు మోపెడ్‌లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, కానీ కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖనే లేదని ఆయన ఎద్దేవా చేశారు. 2014కు ముందు రాష్ట్రంలో కరెంట్ కటకట ఉండేదని, సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో కరెంట్‌ సమస్య పరిష్కారమైందని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని, ప్రాజెక్టులు, ఉచిత కరెంటుతో వ్యవసాయాన్ని పండుగలా మార్చామని మంత్రి చెప్పారు.

- Advertisement -