హీరో మంచు మనోజ్ ఒక పాట పాడారు. ప్రస్తుతం సమాజంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న సంక్షోభ కాలంలో ఆ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని శ్లాఘిస్తూ.. వైద్య సిబ్బంది, పోలీసులు, రైతులు, పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా ప్రజల కోసం పాటు పడుతున్న తీరును ప్రశంసిస్తూ.. పౌరులుగా మన బాధ్యతను గుర్తు చేస్తూ.. మనం బాగుంటామనే ఆశను ప్రకటిస్తూ ‘అంతా బాగుంటంరా’ అని పాడారు. పాట చివరలో ఆయనతో పాటు మంచు లక్ష్మి కుమార్తె విద్వా నిర్వాణ మంచు ఆనంద్ కూడా గళం కలపడం విశేషం.
ఈ పాటను ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా “ఈ చీకటి ఇలాగే ఉండిపోదని, మళ్ళా వెలుగు వస్తుందని, గొప్ప ఆత్మ స్థైర్యం ఇచ్చే గీతం” అంటూ ఆయన ప్రశంసించారు. “హీరో మనోజ్ పాడిన ఈ ఉత్సాహభరితమైన పాట మన హృదయాలను ఆశతో, సానుకూలతతో నింపుతుంది. కుదోస్” అని కొనియాడారు.
‘అంతా బాగుంటంరా’ పాటను ఆవిష్కరించినందుకు కేటీఆర్‌కు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు. “ఇది చాలా హృదయాలలో కొంత సానుకూల ఆశను నింపుతుందని మేము నమ్ముతున్నాం” అని ఆయన ట్వీట్ చేసి, కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.
‘అంతా బాగుంటంరా’ పాటను ప్రముఖ గేయరచయిత కాసర్ల శ్యామ్ రాయగా, అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. వాయిస్ ఓవర్‌ను శ్రీకాంత్ ఎన్. రెడ్డి రాయగా, సన్నీ కూరపాటి ఫొటోగ్రఫీ అందించారు. వర ఎడిటింగ్ చేశారు. ఈ వీడియోను ఎం.ఎం. ఆర్ట్స్ సమర్పిస్తోంది.
ఈ చీకటి ఇలాగే ఉండిపోదని, మళ్ళా వెలుగు వస్తుందని, గొప్ప ఆత్మ స్థైర్యం ఇచ్చే గీతం.
An uplifting song by @HeroManoj1 filling our hearts with hope and positivity. Kudos 👏👏https://t.co/cCbEjXQpGD#Anthabaguntamraa
#TelanganaFightsCorona#StayHomeStaySafe @telanganaCOPs— KTR (@KTRTRS) April 19, 2020