ఆసియాలోని అతిపెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్ ‘ఇండియాజాయ్’ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టెక్నికలర్ ఇండియా కంట్రీ హెడ్ మరియు సిఐఐ నేషనల్ ఏవిజిసి సబ్ కమిటీ ఛైర్మన్ బీరెన్ ఘోష్, మొబైల్ ప్రీమియర్ లీగ్ సహ వ్యవస్థాపకులు & సీఈఓ సాయి శ్రీనివాస్, సినీ నటుడు సుధీర్ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సీఈఓ రాజీవ్ చిలకలపూడి మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇండియా జాయ్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమం అని కొనియాడారు. ఓటీటీ, గేమింగ్‌కు ఆదరణ పెరుగుతోందన్నారు. నేను కూడా ఓటీటీకి అభిమానిని అని తెలిపారు. వీక్షకులకు వినోదం ఇవ్వడంలో ఓటీటీ విజయవంతమైందన్నారు. దేశంలో రోజురోజుకు ఇంటర్నెట్ యూజర్లు పెరిగిపోతున్నారు. ఇమేజ్ సెక్టార్ ఏడాదికి 13.4 శాతం పెరుగుతోందని అంచనా ఉన్నట్లు పేర్కొన్నారు. రెండేండ్లలో కొత్తగా 10 వీఎఫ్ఎక్స్ సంస్థలు కొలువుదీరాయని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 80 వీఎఫ్ఎక్స్ సంస్థలు ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా నగరంలో అనేక గేమ్స్ రూపొందాయన్నారు. ఇమేజ్ టవర్‌ను 2023లో ప్రారంభించేలా కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.