కరీంనగర్ లో ఐటీ టవర్ ను ఈనెల 18న ప్రారంభించనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. పరిశ్రమలు, ఐటీ శాఖలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ఐటీ కంపెనీలలో స్ధానికులకే 80శాతం ఉద్యోగ కల్పన ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మొత్తం 3వేల నుంచి 3వేల 500 మందికి ఇక్కడ ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. తొలుత 12 కంపెనీలతోనే ప్రారంభించాలని భావించామని పేర్కొన్నారు. ఏడాది తర్వాత ఉద్యోగుల సంఖ్య పెంచాలనే నిబంధనతో కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు వివరించారు.
తమ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోకి వచ్చే కంపెనీలకోసం మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేసి సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ , వరంగల్, కరీంనగర్ ఐటీ కంపెనీలు ఉన్నాయని..ఇక నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లోనూ కంపెనీలు ఏర్పాటయ్యేలా చూస్తామన్నారు. వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్.