మంత్రి కేటీఆర్ శనివారం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో మునిసిపాలిటీ కార్యాలయం, కూరాగాయల మార్కెట్ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గతంలో రోడ్ల పక్కన కూరగాయలు అమ్ముకునే వారు, కానీ నేడు చక్కని కూరగాయల మార్కెట్‌ను నిర్మించుకున్నాము.. ఎనిమిది ఎకరాల్లో వైకుంఠదామాన్ని నిర్మించుకున్నము.. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇక్కడి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అని మంత్రి కేటీఆర్ అన్నారు.
నాడు రైతు వ్యవసాయం చేయాలంటే ఆకాశం వైపు చూడాలి. కానీ నేడు 24 గంటల కరెంట్ ను అందిస్తున్నాము. 50 ఏండ్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు చేసింది ఏమీ లేదు. ఎవరికి రాని ఆలోచన మన సిఎం కేసీఆర్ చేసిండు. రైతు సంక్షేమం కోసం రైతు బందు, రైతు బీమాను అందించారు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నాము. 22 వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత సిఎం కేసీఆర్‌దని మంత్రి తెలిపారు.
యాభై ఏండ్లు అవకాశం ఇస్తే.. వ్యవసాయాన్ని అదోగతి పాలు చేసిండ్రు..
రాహుల్ గాందీ రైతు డిక్లరేషన్ అంటుండు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటుండు. ఒక్క ఛాన్స్ కాదు యాభై ఏండ్లు అవకాశం ఇస్తే ఏమి చేశారు. వ్యవసాయాన్ని అదోగతి పాలు చేసింది కాంగ్రెస్. తెలంగాణ వస్తే ఏమి వచ్చిందో చూడండి. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి అని కేటీఆర్ సూచించారు.
100 పడకల దవాఖాన..
కేసీఆర్ వల్ల తనకు ఒంటరి మహిళా పెన్షన్ వస్తుందని కూరగాయల మార్కెట్ లో ఒక మహిళ తెలిపింది. గతంలో నేను రాను బిడ్డ సర్కార్ దవాఖానకు అనే వారు. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు. కొడంగల్ కు 100 పడకల దవాఖాన రావడానికి డెబ్బై సంవత్సరాలు పట్టింది. ఇంటింటికి నల్లతో మంచినీటిను అందిస్తున్నాము. రేవంత్ రెడ్డి చిల్లర మల్లర మాట్లాడుతూ వుంటే చూస్తూ ఉందామా.. ఇక్కడ తంతే మల్కాజిగిరిలో పడ్డాడు రేవంత్. అతను ఐరన్ లెగ్. ఆయన ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ సర్వనాశనం. ఐరన్ లెగ్ కావాలా.. గోల్డెన్ లెగ్ కావాలో తేల్చుకోండి. మాటల మనిషి కాదు చేతల మనిషి కావాలి. పని చేసే పెద్ద మనిషి కావాలి అన్నారు కేటీఆర్.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను తీసుకొస్తం..
దేశంలో ఏ సీఎం చేయనట్టుగా దళిత బంధును తీసుకు వచ్చారు కేసీఆర్. బంజారా భవన్ మా సిరిసిల్లలో కూడా లేదు.. కానీ కొడంగల్ లో ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఇక్కడకు తీసుకు వస్తాము. అందులో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.
దద్దమ్మలకు మాత్రమే అభివృద్ధి కనబడదు..
రేవంత్ రెడ్డి మా కులానికి పదవులు కావాలి అంటున్నాడు.. కానీ మా నరేందర్ రెడ్డి నాకు అన్ని కులాలు కావాలి అంటుండు. రంగారెడ్డి పాలమూరు పూర్తి చేసి కొడంగల్ లోని బిడు భూములను సస్యశ్యామలం చేస్తాం అన్నారు. దద్దమ్మలకు మాత్రమే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కనబడదు. వాళ్ళు వస్తే సర్కస్ కు కొత్త జంతువులు వస్తె చూసినట్టు వెళ్ళి చూసిరండి అని కేటీఆర్ ఎద్దేవ చేశారు.
మోడీ.. పాలమూరు-రంగారెడ్దికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వవు
ఇక్కడి నుండి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా మా పాలమూరు రంగారెడ్దికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వవు. జన ధన్ లో రూ.15 లక్షలు ఇస్తా అంటివి.. ఏవి. రెండు లక్షల ఉద్యోగాలు ఏవి. 2012లో సిలిండర్ 400 రూపాయలు ఉంటే అప్పటి కాంగ్రెస్ పై మోడీ విమర్శలు చేసావు, మరి ఇప్పుడు సిలిండర్ ను నువ్వు ఎంతకు పెంచావు అని ప్రశ్నించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. సొంత ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలను ఈ సంవత్సరం నుండే అందిస్తామన్నారు. కేంద్రం నుండి మనకు రావాల్సిన నిధులను మెడలు వచ్చి తీసుకువద్దామని కేటీఆర్ తెలిపారు.