తెలంగాణకు అడుగడుగునా మోసం చేస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం హనుమకొండలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కేసీఆర్ అనే మూడు అక్షరాల పదం లేకపోతే ఇవాళ్టి టీ పీసీసీ, టీ బీజేపీ ఎక్కడివి? ఇవాళ మొరుగుతున్న కుక్కలకు, గాడిదలకు ఆ పదవులు ఎక్కడివి? వీరిని ఆంధ్రప్రదేశ్‌లో పట్టించుకోలేదు. ఎవడు రేవంత్ రెడ్డి, ఎవడు బండి సంజయ్.. వీళ్లు ఎగిరెగిరి పడుతరు. నోటికొచ్చినట్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నరు. మోదీని బట్టేవాజ్ అని, లుచ్చాగాడు అని అనలేమా? కానీ మాకు కేసీఆర్ సంస్కారం నేర్పారు. మేం నోరు విప్పితే మా కంటే ఎవరూ బాగా మాట్లాడలేరని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఒకడు కరీంనగర్‌లో ఏం పీకలేదు.. కానీ పాలమూరులో తిరుగుతుండు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ట్రిపుల్ ఐటీని తీసుకురాలేని దద్దమ్మ పాలమూరును ఉద్ధరిస్తడంటా? భారతీయ జనతా పార్టీ బేకర్ నాయకుల్లారా.. తెలంగాణకు మీరు ఏం చేశారు? పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును కాళ్లతో తన్నింది మీరు కాదా? ఏడు మండలాలను గుంజుకుపోయి కలిపింది నరేంద్ర మోదీ కాదా? విద్యుత్ కొరతతో అలమటించి పోతుంటే ఏడు మండలాల్లోని లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రాలో కలిపింది ఈ బీజేపీ కాదా? అని కేటీఆర్ నిలదీశారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు అని ఒకడు అంటడు. మరొకడేమో నూకలు తెలంగాణ ప్రజలకు తినడం అలవాటు చేయించాలని అంటడని కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు కూడా చిల్లరగాళ్లు. నిజామాబాద్ ఎంపీ ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి మోసం చేశాడు. బూతులు తప్ప ఏం మాట్లాడడు. ఆదిలాబాద్ ఎంపీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెరిపిస్తానని చెప్పి, అడ్రస్ లేకుండా పోయాడు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి.. ప్రపంచంలోనే అతిపెద్దదైన సంప్రదాయ మెడిసిన్‌లకు సంబంధించిన గ్లోబల్ సెంటర్‌ను హైదరాబాద్‌లో పెడుతామని చెప్పిండు.. కానీ నరేంద్ర మోదీ ఆ సంస్థను గుజరాత్‌లోని జామ్ నగర్‌కు తరలించాడు. ఈ ఏడున్నరేండ్లలో మోదీ ప్రభుత్వం, చిల్లర బీజేపీ నాయకులు తెలంగాణకు అన్యాయం చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ బహిరంగ సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.