శాన్ ఫ్రాన్సిస్కో టూ కాలిఫోర్నియా వేదిక ఏదైనా విషయం మాత్రం తెలంగాణే. కలుస్తున్నది ఎవరినైనా సరే తెలంగాణ వైభవాన్ని పరిచయం చేయాలన్న తపనే. ఎక్కడికి వెళ్లినా ఘనమైన తెలంగాణ గతాన్ని గుర్తుచేస్తు వర్తమానంతో ప్రపంచాన్ని కనెక్ట్ చేయాలన్నదే మంత్రి కేటీఆర్ ఆరాటం. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్, తెలంగాణ చేనేత, హస్తకళల విశిష్టతను అక్కడి ప్రముఖులు, దిగ్జజాలకు వివరించారు. సిస్కో, నోకియా, ఎరిక్సన్ తో పాటు పలు కంపెనీల ప్రతినిధులను కలిసిన సమయంలో తెలంగాణ హస్తకళలు, చేనేతకు సంబంధించిన ఉత్పత్తులను బహుమానంగా ఇచ్చారు.
చేనేత, హ్యాండీక్రాప్ట్ కు గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను వివరించారు. పోచంపల్లి కళాకారుల నైపుణ్యం, వస్త్రాల నాణ్యతను చెప్పారు. తెలంగాణ హస్తకళలు, చేనేత గొప్పదనాన్ని తెలియచేయడం తన బాధ్యతగా భావించిన మంత్రి, పలు వేదికలపై మన వైభవాన్ని ఎలుగెత్తి చాటారు. ఐటీ మినిష్టర్ గా ఓ వైపు టెక్ ప్రముఖులను కలుస్తూనే మరోవైపు ఇక్కడి మట్టి పరిమళాన్ని కూడా పరిచయం చేశారు. తెలంగాణ హస్తకళలు, చేనేత కళాకారులు సాధించిన విజయాలు, చేస్తున్న అద్భుతాలను సిలికాన్ వ్యాలీలోని ఐటీ ఫ్రొఫెషనల్స్ తో షేర్ చేసుకున్నారు. మన కళాకారులు నేసిన వస్త్రాలు, తయారుచేసిన వస్తువులను బహుమానంగా ఇచ్చారు.