దివ్యాంగులకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను ఉచితంగా అందిస్తున్నరాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని భగవాన్ మహవీర్ వికలాంగ్ సహాయతా సమితిని గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రితో పాటు అధికారుల బృందం కృత్రిమ అవయవాల తయారీ, పనితీరును పరిశీలించారు. భగవాన్ మహావీర్ బోధనల నుంచి స్ఫూర్తినొంది 1975లో స్థాపించి, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థను నడిపిస్తున్నారు. సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాలను తయారీ చేసే మోబైల్ వాహనాన్ని తమ రాష్ట్రానికి కూడా అందజేయాలని మంత్రి కోరగా సంస్థ నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ కింగ్ కోఠిలోని తమ సంస్థకు చెందిన యూనిట్ అభివృద్ధికి చేయూతనివ్వాలన్న విజ్ఞప్తిని తెలంగాణా ప్రభుత్వం తప్పక పరిశీలిస్తుందని మంత్రి వారికి హామీనిచ్చారు.
దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు, భద్రతకు, సంక్షేమానికి, సముద్ధరణకు సీఎం కేసీఆర్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతినెల రూ.3,016 రూపాయల పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు.