అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి- మంత్రి

97
- Advertisement -

అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై శుక్రవారం మంత్రి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో 12 మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించారని మంత్రి తెలిపారు. సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటే మంచిది కాదని గుర్తించిన ప్రభుత్వం గత 7 సంవత్సరాలో తెలంగాణకు హరితహారం పేరిట పెద్ద ఎత్తున 2 కోట్ల 48 లక్షల మొక్కలు నాటిందని మంత్రి తెలిపారు. సీఎం కేసిఆర్ కృషి ఫలితంగా రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరిగిందని మంత్రి అన్నారు.

పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమాయకమైన గిరిజనలు, ఇతర వర్గాలకు చెందిన పేదలకు నష్టం జరుగకుండా, అదే సమయంలో భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వారు దుర్వినయోగం చేయకుండా సమస్యలను పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. అడవుల సంరక్షణ కోసం క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో పాటు పార్టీలకతీతంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయి ఉంటే సహకరించాలని మంత్రి కోరారు. హరితహారంలో భాగంగా మనం సామాజికంగా మనం ఎన్ని కోట్ల మొక్కలు నాటినా ఒక అడవితో సమానం కాదని మంత్రి తెలిపారు.10 ఎకరాల భూమి కొన్ని లక్షల మొక్కలతో సమానమని, దీనిని గుర్తించిన ప్రభుత్వం అడవుల పునరుజ్జీవనం చేసే దిశగా పకడ్భందిగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1347 కోట్లు ఖర్చు చేసి 10.63 లక్షల ఎకరాలో 42 కోట్ల 41 లక్షల మొక్కలు నాటి అటవీ పునరుజ్జీవనం చేశామని మంత్రి తెలిపారు.

అడవులను విధ్వంసం చేసే వారిని గుర్తించి వారిపై కఠినంగా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని, ఇక ముందు భూములు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని జిల్లా ఎస్పీని మంత్రి ఆదేశించారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 96,679 మంది పోడు రైతులకు 3,08,614 ఎకరాల భూమి ఆర్ఒఎఫ్ఆర్ పట్టాలను ప్రభుత్వం అందించిందని, ప్రస్తుత అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మరో 7,23,629 ఎకరాల అటవీ భూమిలో 1,99,354 మంది పోడు సాగు చేస్తున్నారని, జగిత్యాల జిల్లా241900 హెక్టార్ల భూ చుట్టు కొలత కలిగి ఉండీ, 53,735 హెక్టార్ల అటవీ ప్రాంతం 22.21% ఉన్నదని, ఇందులో 12 మండలాల్లో 45 గ్రామాలో 6684.16 ఎకరాల అటవీ భూములు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు ప్రాధమికంగా గుర్తించారని మంత్రి తెలిపారు. జిల్లాలో ఆక్రమణకు గురైన అటవీ భూములలో సాగు చేసుకుంటున్న రైతుల వివరాలు మరొక్క సారి రీ సర్వే చేసి పూర్తి వివరాలు సేకరించాలని, భూ కబ్జాదారులు, రియల్ స్టేట్ చేసే వారిని గుర్తించాలని మంత్రి అధికారులకు సూచించారు.

పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం అటవీ ప్రాంతాలు ఉన్న ప్రతి గ్రామంలో అటవీ హక్కుల కమిటి ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. నవంబర్ మాసంలో పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, తదితరుల నుండి క్లెయిమ్స్ స్వికరిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులను గుర్తించి వారికి పట్టాలు పంపిణీ చేస్తామని, పట్టాలు ధృవీకరించే సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మరోసారి అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కరించిన తరువాత గ్రామంలో మరో ఇంచు అటవీ భూమి ఆక్రమణకు పాల్పడకుండా సంబంధిత గ్రామ సభ తీర్మానించాలని మంత్రి తెలిపారు. అడవి లోపల పోడు సాగు చేస్తున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను సాగుకు కేటాయిస్తామని,ప్రభుత్వ భూములు లేని పక్షంలో అటవీ భూముల అంచున సాగు భూమిని కేటాయిస్తామని తెలిపారు. జిల్లాలో పోడు సాగుకు సంబంధించి పట్టాలు పంపిణీ చేసిన తరువాత మిగిలిన అటవీ భూమి పకడ్భందిగా సంరక్షించుకోవాలని తెలిపారు.అటవీ సరిహద్దు ఏర్పాటు చేసి ఉపాధి హామి నిధులు, అటవీ నిధులు సంయుక్తంగా వినియోగిస్తూ చుట్టు ప్రహారీ గోడలు, ట్రేంచ్ లు నిర్మించాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి.రవి, జిల్లా ఎస్పీ. శ్రీమతి సింధుశర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఎమ్మెల్యేలు, డి.ఎఫ్. ఓ.వెంకటేశ్వరరావు, 12 మండలాల జెడ్పిటిసీలు, ఎం.పి.పిలు, ఎంపిటీసీలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -