ఎస్సీ ఎస్టీలకు నైపుణ్య శిక్షణతో స్వయం ఉపాధి..

268
minister koppula
- Advertisement -

గ్రామీణ ప్రాంతాలలోని చదువుకున్న నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి, మరియు ఇతర ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. శుక్రవారం సంక్షేమ భవనంలోని సమావేశ మందిరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ ఇచ్చే పలు సంస్థల ప్రతినిధులతో, ఎస్సి కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన డైరెక్టర్లు తాము వివిధ రంగాలలో ఇచ్చే నైపుణ్య శిక్షణ, మరియు ఉపాది అవకాశాల గురించి దృశ్య మాధ్యమంలో వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో మరియు తర్వాత వలస కార్మికులు బీహార్ చత్తీస్గడ్ బెంగాల్ లాంటి రాష్ట్రాలకు తరలిపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఎస్సీ ఎస్టీలను విద్యావంతులు చేయడానికి ప్రభుత్వం గురుకుల వ్యవస్థను పెద్దఎత్తున ప్రారంభించిందన్నారు. ఇది అద్భుతమైన వ్యవస్థ భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని గురుకుల విద్యాలయాలు గాని లేవు. ఈ సంస్థల నుండి ముందు ముందు మంచి జాతిరత్నాలు వస్తారని మంత్రి అన్నారు.

వాళ్ల వాళ్ల విద్యార్హతలను బట్టి యువతకు వారికి ఏ రంగంలో శిక్షణ ఇస్తే బాగుంటుందో పథకాలను సిద్ధం చేసుకోండి. ఒకటి రెండు సంవత్సరాలు ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తే ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు గొప్పగా కొనసాగుతాయన్నారు. నిర్మాణ రంగం, డ్రైవింగ్, విద్యుత్,భూసర్వే లాంటి శాఖలలో నైపుణ్య శిక్షణ పొందిన వారికి ఎన్నో ఉపాధి మార్గాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరాం భూక్య ,NAC, NSIC, ITI, RTC,NITHEL, CIPT, CITD, లాంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ డైరెక్టర్లు ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -