సేవాభావం కలిగి ఉన్న విద్యార్థినీ, విద్యార్థులే ఎంబిబిఎస్ చదువాలని నిర్ణయించుకుంటారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డాక్టర్లు, నర్సులు సేవాతత్పరత కలిగి జబ్బుల బారినపడిన వారికి వైద్యసేవలు అందించడం ఇది చాలా గొప్ప కార్యమన్నారు. నగరంలోని “ఐఎస్ఎం ఎడ్యుటెక్”సంస్థ ఆదివారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజాన్ని పట్టిపీడిస్తున్న కోవిడ్ -19 మహమ్మారిని తరిమికొట్టడంలో డాక్టర్లు, నర్సులు,వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సంస్థ ద్వారా విదేశాలలో ఎం.బి.బి.ఎస్ అభ్యసించిన యువ డాక్టర్లు తమ స్వస్థలాలకు తిరిగి వచ్చి కరోనా నివారణకు అంకితభావంతో కృషి సల్పుతున్నారని మంత్రి ప్రశంసించారు. ఈ విధంగా సేవలందిస్తున్న పలువురు డాక్టర్లను మంత్రి సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను విదేశాల్లోని అత్యుత్తమ విద్యాసంస్థలకు మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తున్న ఐ.ఎస్.ఎం సంస్థ యాజమాన్యానికి మంత్రి అభినందనలు తెలిపారు.