కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న విద్యుత్ చట్ట సవరణ సమాఖ్య స్పూర్తికి విఘాతం అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. విద్యుత్ సవరణ బిల్ల,శ్రీశైలం పవర్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై మాట్లాడిన ఆయన …కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ చట్టంతో రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు.
రాష్ర్టాలను సంప్రందించాకే కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కొత్త విద్యుత్ చట్టం ప్రకారం టారిఫ్ విధానం మారుతుందన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాలు పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈ చట్టంతో థర్మల్ విద్యుత్ వినియోగం తగ్గుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం తీసుకువచ్చే కొత్త విద్యుత్ చట్టంతో రైతులకే కాకుండా, పరిశ్రమలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
శ్రీశైలం విద్యుత్ ప్లాంట్‌లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. కంట్రోల్ ప్యానల్స్ లో ప్రమాదం జరగడంతో విధుల్లో ఉన్న సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదని చెప్పారు. శ్రీశైలం ప్రమాద ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించామని మరణించిన ఏడుగురు కుటుంబాల్లో అర్హులైన వారికి ఉద్యోగం కల్పించేలా చూడాలని జెన్‌కోకు ఆదేశాలు జారీ చేశామన్నారు.