బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని అటువంటి పార్టీతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దేశ ప్రజలను సూచించారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఆదరణ లేదని అది మునిగి పోయే పడవని ఆయన అభివర్ణించారు. అమెరికాలో జరుగుతున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చివరి రోజున అమెరికాలోని టిఆర్ఎస్ పార్టీ విభాగం న్యూజెర్సీ లోని కనివెన్షన్ సెంటర్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, తాండూరు శాసన సభ్యులు పైలట్ రోహిత్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం లేవనెత్తిన పలు సందేహాలను మంత్రి జగదీష్ రెడ్డి నివృత్తి చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాలుగా దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దిక్కు లేక సుప్త చేతనవస్తితిలోకి చేరుకుందన్నారు. దేశాన్ని గడిచిన ఎనిమిదేండ్లుగా సాగుతున్న మోడీ పాలనలో దారిద్య్రం మరింత పెరిగి పోయిందని ఆయన విమర్శించారు. బీజేపీ పాలనలో తెలంగాణాకు పెద్దగా ఒరిగన ప్రయోజనం అంటూ ఏది లేదన్నారు. యావత్ భారత దేశం ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని అందుకు ఆయన ఎనిమిదేండ్లుగా అందించిన అభివృద్ధి నమూనా నే కారణమన్నారు మంత్రి.