దూరాజపల్లి జాతర ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష..

29
jagadish reddy

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దూరాజపల్లి లింగమంతుల జాతరకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఫిబ్రవరి 28 నుండి ప్రారంభం కానున్న జాతర ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ పద్మజా రాణి,జడ్ పి సి యి ఓ విజయలక్ష్మి,డి పి ఓ యాదయ్య, డి యం హెచ్ ఓ హర్షవర్ధన్, ఆర్ డి ఓ రాజేంద్ర కుమార్,డి యస్ పి మోహన్,మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తో పాటు మిషన్ భగీరథ ఇంట్రా సి యి,ఆర్&బి డి యి మహిపాల్ రెడ్డి,పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన దూరాజపల్లి జాతర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. కరోనా ను దృష్టిలో పెట్టుకుని శానిటేషన్ పకడ్బందీగా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనిమున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన జాతరలను అధికారులు శాఖల వారిగా సమీక్షించుకోవాలని కోరారు. ప్రత్యేకించి శాశ్వత ప్రాతిపదికన సిసి కెమెరాలు,సోలార్ సిస్టం ఏర్పాటుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అంతే గాకుండా ఇమాంపేట ప్రభుత్వ భూమిలో డంప్ యార్డ్ ఏర్పాటు చేయ్యడంతో పాటు గుడికి సమీపంలో ఉన్న చెరువుల చుట్టూ తాత్కాలికంగా ఫీనిషింగ్ ఏర్పాటు చేసి శాశ్వతంగా ఫీనిషింగ్ ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.నిరంతర నీటి సరఫరాతో పాటు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయలు కలుగకుండా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.

భక్తుల టాయిలెట్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచడంతో పాటు నిరంతరం నీటి సరఫరా ఉండాలని మిషన్ భగీరథ అధికారులకు ఆయన సూచించారు. గుడికివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నందున జాతీయ రహదారిపై ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దానికి తోడు రెండు సౌండ్ ఫ్రూఫ్ జెనరేటర్లు ఏర్పాటు చేస్తున్నామని అదే సమయంలో విద్యుత్ సరఫరాకు ఏర్పాటు చేసే డిబి ల చుట్టూ విధిగా భద్రతా వలయం ఏర్పాటు చేయాలన్నారు.గుడికి సమీపంలోనీ రహదారుల మరమ్మతులతో పాటు అవసరమైన చోట కొత్త రహదారులు నిర్మించే విదంగా చూడాలన్నారు.

గుడి పైకి వాహనాలు వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలంటూ ఆర్‌ అండ్‌ బి అధికారులను ఆదేశించిన మంత్రి జగదీష్ రెడ్డి గుడిపైన ఉన్న గెస్ట్ హౌస్ అన్ని హంగులతో సిద్ధం చేయాలని కోరారు.మౌళిక సదుపాయాలు కల్పించడంలో శాఖలు పరస్పరం సమన్వయం చేసుకొని సహకరించుకోవాలని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన చెప్పారు.అన్నింటికీ మించి శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ అడుగడుగునా నిఘా పెంచాలని చెప్పిన మంత్రి జగదీష్ రెడ్డి గుడిచుట్టూ ఉన్నా రైతాంగంతో సంప్రదించి భూములు చదును చెయ్యాలని కోరారు.వాహనాల పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇక్కట్లు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు.